
- సెప్టెంబర్‌లోనే మొదటి పికింగ్
- ప్రయివేటు వ్యాపారులకే అమ్మకాలు
- చోద్యం చూస్తున్న మార్కెటింగ్ శాఖ
ప్ర్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : సాలూరు నియోజకవర్గం పరిధిలో పత్తి కొనుగోలు కేంద్రం ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబరులో పత్తి మొదటి సారి ఏరివేత ప్రారంభమవుతుంది. అంటే అప్పటి నుంచే రైతులు అమ్మ కానికి సిద్ధంగా ఉంటారని తెలిసినా ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. అక్టోబరు, నవంబర్ నెలల్లో రెండోసారి ఏరివేత చేయడం కూడా జరిగింది. అయినా జిల్లా అధికారులు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించలేదు. ప్రతి ఏటా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం నామమాత్రంగా ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. గడచిన మూడేళ్లుగా ఇక్కడ ఆలస్యంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయ డం, ఈలోగా రైతులు వ్యాపారులకు విక్రయించేయడం జరుగుతోంది. ప్రయివేటు వ్యాపారులు క్వింటాకు రూ.6వేల నుంచి రూ.6500 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.7020 అంటే రైతులు క్వింటాలుకు రూ.500 నుంచి వెయ్యి రూపాయలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గత కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. నియోజకవర్గ పరిధిలో పాచిపెంట, సాలూరు, మక్కువ మండలాల్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగవుతోంది. పాచిపెంట మండలంలో 2600ఎకరాలు, సాలూరు మండలంలో 1200 ఎకరాలు, మక్కువ మండలంలో 600ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఏటా ఇక్కడ ఎఎంసి యార్డ్‌లో కొనుగోలు ఏర్పాటు చేసినట్లు బోర్డు పెట్టి వదిలేస్తుంది. ఈ క్రాప్ నమోదు, తేమ శాతం వంటి నిబంధనలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి గుదిబండగా వుంటాయనే కారణంతో రైతులు ప్రయివేటు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారనే నమ్మకం లేకపోవడంతో రైతులు ఏదో ఒక ధరకు సర్దుకుని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభంలోనే సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఇక్కడ సీజన్ చివరి వరకు ప్రారంభించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
జిన్నింగ్ మిల్లుతో సిసిఐ అధికారుల కుమ్మక్కు
విజయనగరం జిల్లా రామభద్రపరం మండలంలోని ముచ్చర్లవలసలో పత్తి జిన్నింగ్ మిల్లు గత కొంతకాలంగా నడుస్తోంది. ఈ ప్రాంతంలో పండించిన పంట అంతా వ్యాపారుల ద్వారా ఈ మిల్లుకే చేరుతోంది. సిసిఐ, మార్కె టింగ్‌శాఖ అధికారులు జిన్నింగ్ మిల్లు యాజమాన్యంతో కుమ్మక్కు కారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ఆల స్యంగా ప్రారంభిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. రైతుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు అందని ద్రాక్షలా తయారైంది. క్వింటాకు రైతులు వెయ్యి రూపాయల వరకు నష్టపోతున్నారు. దళారీల వలలో రైతులు విలవిలాడుతున్నారు.