Jun 01,2023 20:17

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ నుంచి పంట కాలువలకు గురువారం సాగు నీటిని ఇద్దరు మంత్రులు విడుదల చేశారు. తొలుత వారు కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తూర్పు డెల్తా కాలువ నుంచి రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సెంట్రల్‌ డెల్టా కాలువ నుంచి రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ముందస్తు సాగుకు ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. ఈ నేపథ్యంలో పంట కాలువలకు ముందుగా నీటిని విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం గోదావరిలో ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం రెండు వేల క్యూసెక్కుల నీటిని పంట కాలువలకు విడుదల చేశామని తెలిపారు. గతేడాది చేపట్టిన ముందస్తు సాగు సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. మంత్రి తానేటి మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండగగా చేసిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ముందుస్తుగా సాగు నీటి విడుదల వల్ల సకాలంలో విత్తనాలు వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగా వారి కోసం పలు పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ ప్రాంతాల వారీగా నీటి విడుదలకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మార్గని భరత్‌, ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు, ఇరిగేషన్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.