Nov 11,2023 21:08

న్యూఢిల్లీ : ధన త్రయోదశి సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం రిటైల్‌ అమ్మకాలు భారీగా జరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే దేశ వ్యాప్తంగా రిటైల్‌ మార్కెట్‌లో రూ.50వేల కోట్లకు పైగా వ్యాపారం నమోదయ్యిందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సిఎఐటి) వెల్లడించింది. ఇందులో ఒక ఢిల్లీలోనే రూ.5,000 కోట్ల విలువైన క్రయ, విక్రయాలు జరిగాయి. గతేడాది ధన త్రయోదశి సమయంలో రూ.35వేలకోట్ల వ్యాపారం జరిగిందని సిఎఐటి తెలిపింది. ఈ ఏడాది మెరుగైన వృద్థి చోటు చేసుకుందని సిఎఐటి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే 43 శాతం అధిక అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. అదే విధంగా రూ.5,000 కోట్ల విలువైన వాహనాలు, రూ3వేల కోట్ల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు, రూ.300 కోట్ల పూజా సామగ్రి అమ్మకాలు జరిగాయన్నారు. ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల విక్రయాలు గతేడాది కంటే 15 నుంచి 20 శాతం ఎక్కువగా జరిగాయన్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల చిన్న, పెద్ద ఆభరణాల వ్యాపారులున్నారన్నారని ఆల్‌ ఇండియా జ్యువెలర్స్‌ అండ్‌ గోల్డ్‌ స్మిత్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు పంకజ్‌ అరోరా తెలిపారు. ధన్‌తేరస్‌లో 41 టన్నుల బంగారం, 400 టన్నుల వెండి ఆభరణాలు, నాణేలు అమ్ముడయ్యాయని వెల్లడించారు.