
- ఐదుగురు సైబర్ మోసగాళ్లు అరెస్టు
ప్రజాశక్తి- కడప అర్బన్:నకిలీ వేలిముద్రలతో ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతా నుంచి నగదును డ్రా చేసిన ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నకిలీ వేలిముద్రలు తయారు చేసే సామగ్రిని, కారును స్వాధీనం చేసుకున్నారు. వారిని మీడియా ఎదుట హాజరుపర్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించి ఎస్‌పి అన్బురాజన్ తెలిపిన వివరాల ప్రకారం... ఆధార్ ఆధారిత సమాచార దుర్వినియోగం కేసులో ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన నల్లగళ్ల వెంకటేశ్, మళ్ల అజరు, గంట కల్యాణ్, షేక్ జానీ, పుసుపులేటి గోపిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం ద్వారా నిందితులు రూ.5.9 కోట్ల కాజేశారు. వెబ్‌సైట్ల ద్వారా డాక్యుమెంట్లను సేకరించి వాటిలోని వేలిముద్రలను నకిలీవి తయారు చేసేవారు. బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు మాయమవుతుండడంపై వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఎఎస్‌పి తుషార డూడి ప్రత్యేక బృందం అనుమానిత నంబరును ట్రాక్ చేసి కడప పాత బైపాస్ వద్ద నిందితులను అరెస్టు చేసింది. వారిపై ఇప్పటికే నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు, 412 ఎన్‌సిఆర్‌పి పిటిషన్లు నమోదయ్యాయి. వారికి సంబంధించిన 12 అకౌంట్లను సీజ్ చేసి ఇడికి పంపనున్నామని ఎస్‌పి తెలిపారు. వారు వినియోగించిన సమాచార వెబ్‌సైట్ల మూసివేతకు సిఫారసు చేయనున్నట్లు చెప్పారు. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్‌పి కోరారు.