Jul 31,2023 17:47
  • ఇద్దరికీ అనేక దోపిడీ హత్య నేరచరిత్ర
  • వివరాలను వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్

ప్రజాశక్తి కాకినాడ కార్పొరేషన్ : కాకినాడ జిల్లాలో 2023 జూన్, జూలై నెలల్లో జాతీయ రహదారి (ఎన్ హెచ్ -16) పై దోపిడీ, హత్య నేరాలకు పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర నేరస్తులను కాకినాడ పోలీసులు విశాఖలో అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన సునీల్ సాహు(45), ఒడిశా రాష్ట్రం సంబల్ పూర్ జిల్లా బుర్లా గ్రామానికి చెందిన రాజ్ బిందా సింగ్(30) అను నేరస్తులు ఈనెల 16వ తేదీ రాత్రి 9.30 గంటలకు జాతీయ రహదారిపై రాజుల కొత్తూరు గ్రామ శివారున జరిగిన సంఘటనకు సంబంధించి నమోదైన కేసులో, అదే రోజు రాత్రి 11.30గంటలకు ఎర్రకోనేరు-హంసవరం రహదారిలో జరిగిన కేసులో, గత నెల 12వ తేదీన సామర్లకోట-పిఠాపురం రహదారి కుమారపురం శివారులో జరిగిన కేసులో నిందితులని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ తెలిపారు.ఇద్దరు నిందితులు ఆటో ప్రయాణికుల వలె ఎక్కి నిర్జన ప్రదేశానికి ఆటో చేరుకోగానే డ్రైవర్, ఆటోలోని ప్రయాణికులపై దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు దోచుకుంటారని తెలిపారు. అలాగే ఇళ్లల్లో ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులు చేసి మారణాయుధాలతో బెదిరించి ఎదురు తిరిగితే చంపి విలువైన వస్తువులు తీసుకుని పరారవుతారన్నారు. సునీల్ సాహు ఓకేసులో జీవిత ఖైదీ అన్నారు. నిందితులపై ఇతర రాష్ట్రాలలో అనేక కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఈనెల16 వతేదీ రాత్రి  09.15 గంటల సమయంలో అరెస్టు కాబడిన ఇరువురు వ్యకులు ఎన్ హెచ్ 16 తేటగుంట గ్రామం వద్ద ఆటో ఎక్కి నిర్మానుష్య ప్రదేశానికి చేరుకొని రాజ్ బిందా సింగ్ ఆటో డ్రైవర్ మెడ పట్టుకొనగా సునీల్ సాహు వెనక వైపు నుండి ఆటో డ్రైవర్ ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచి ఇద్దరు ఆటో తీసుకోని పారిపోవడం జరిగిందన్నారు. నిందితులు ఆటో తీసుకోని పారిపోతూ స్వలాభం కోసం అదే రోజు రాత్రి 11.30 గంటలకు యర్రకోనేరు గ్రామం, తుని మండలం సమీపంలో హత్యకు పాల్పడ్డారన్నారు. ప్రగడా నాగమణి కాఫీ హోటల్ లోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటన్న ఆమెను రాజ్ బిందా సింగ్ ఆమె మెడపై కత్తి పెట్టి బెదిరించగా సునీల్ సాహు పప్పు సత్యవతి(62) ను కత్తితో బెదిరించి డబ్బులు బంగారం ఇవ్వమని అడుగగా నిరాకరించినందున  ఆమెను విచక్షణరహితంగా పొడిచి హత్య చేసి బంగారపు పుస్తెల త్రాడు మరియు సెల్ ఫోన్ లను బలవంతంగా తీసుకొన్న అనంతరం  అక్కడ నుండి పారిపోయారన్నారు. 
పై రెండు సంఘటనలకు ఒక నెల ముందు జూన్ 12వ తేది రాత్రి 8.00 గంటల సమయంలో సామర్లకోట నుండి పిఠాపురం ఏడూ మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటో లో సునీల్ సాహు అతని స్నేహితుడు అయిన  కైలాష్ బాగ్ లు సామర్లకోటలో ఎక్కి ఇద్దరూ డ్రైవరుకి రెండువైపుల కూర్చొని ఆటో డ్రైవర్‌ నడుపుకుంటూ వెళ్తూ, సామర్లకోట శివారులో ఉన్న టిడ్‌కో ఇళ్లు దాటి ఆటో వెళ్తున్నపుడు, అకస్మాత్తుగా ఇద్దరు ఆటో డ్రైవర్‌ను కత్తితో పొడిచి పక్క పొలాల్లో పడేయడంతోపాటు మిగిలిన ప్రయాణికులను కూడా పిస్టల్, కత్తులు చూపించి బెదిరించి దాడి చేసి నగదు, బంగారం దోచుకుని అక్కనుండి పారిపోయే క్రమంలో కుమారపురం గ్రామ శివారున ఆటోని వదిలివేసారన్నారు. జరిగిన సంఘటనపై ఆటో ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదుపై జూన్19 వ తేదీ పిఠాపురం రైల్వే స్టేషన్ లో ఈ కేసులో కైలాష్ బాగ్  అరెస్ట్ కాబడి రెండవ ముద్దాయి సునీల్ సాహూ పరారీలో వున్నాడన్నారు.విశాఖపట్నంలో ఇరువురు వ్యక్తులును అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ఆటో, బంగారు ఆభరణాలు, నగదు మరియు మొబైల్ ఫోన్ ను వారి నుండి స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. 
ఈ కరుడుగట్టిన నేరస్తులను అరెస్ట్ చేసే విషయం లో నిరంతర కృషి చేసిన పెద్దాపురం డిఎస్పీ లతా కుమారి, తుని రూరల్, జగ్గంపేట, ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ లు మరియు వారి సబ్ ఇన్స్పెక్టర్ లు, జిల్లా సిసిఎస్. అధికారులు మరియు సిబ్బంది, జిల్లా ఐటీ కోర్ విభాగ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులు ప్రకటించడం జరిగింది.