
కరీంనగర్ : జల్సాల కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర సైబర్ నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌పీ అఖిల్ మహాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.బీహార్ రాష్ట్రానికి చెందిన కుందన్‌కుమార్ తొమ్మిదో తరగతి దాకా చదువుకున్నాడు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు చేసేవారి వద్ద గతంలో సైబర్‌కోర్సు నేర్చుకొని ఇలాంటి మోసాలు పాల్పడుతున్నాడని చెప్పారు. సులువుగా ప్రజల వద్ద నుంచి డబ్బుల కాజేసి విలాసవంతమైన జీవితం గడిపెందుకే ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడని పేర్కొన్నాడు. ఇందులో భాగంగా ఆరు నెలల క్రితం ఆన్‌లైన్‌లో వివిధ సిమెంట్ కంపెనీల తప్పుడు వివరాలు సేకరించాడు. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి సిమెంట్ అవసరాలు ఉన్న వారి వివరాలను సేకరించి వారికి సిమెంట్ సరఫరా చేస్తానని నిందితుడు నమ్మించి డబ్బులు కాజేసినట్లు తెలిసిందని చెప్పారు.
ఈ క్రమంలోనే బిర్లా ఏ1 సిమెంట్ కంపెనీ పేరుతో తప్పుడు వివరాలు క్రియేట్ చేసి జిల్లాకు చెందిన ఉత్తం అంజయ్యకు 640 బస్తాలు పంపిస్తానని సూమారు రూ. రెండు లక్షలు ఆన్‌లైన్‌లో ద్వారా తీసుకోని మోసం చేశాడు. దీంతో బాధితుడు అంజయ్య వీర్నపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని చెప్పారు.
దర్యాప్తులో భాగంగా సీఐ మొగిలి ఆధ్వర్యంలో సైబర్ సెల్ ఎస్‌ఐ జూనైదర్, స్పెషల్ టీం రంగంలోకి దిగి ఆధునిక సాంకేతికత ద్వారా బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా చమర్ గ్రామంలో ఉన్న నిందితుడిని సోమవారం అరెస్టు చేసి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అతని వద్ద రూ.2లక్షల నగదు, మూడు మొబైల్ ఫోన్స్, ఆరు సిమ్ కార్డులు, బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోన్ యాప్, లాటరీ, పార్ట్‌టైం జాబ్స్, తక్కువ పెట్టుబడితో ఎక్కవ లాభం అంటూ ఆశపడితే మోసపోవడం ఖాయమన్నారు. సైబర్ నేరం జరిగితే వెంటనే ఎన్‌సీఆర్పీ పోర్టల్ www.cybercrime.gov.in టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలని సూచించారు. సమావేశంలో సీఐ మొగిలి పాల్గోన్నారు.