Nov 06,2023 11:20

 హోంస్టాండింగ్‌ కమిటీ భేటీ
 కమిటీ మరింత విస్తృతంగా పరిశీలించడానికి ప్యానెల్‌ కోసం పొడిగించాలి : ప్రతిపక్ష సభ్యుల డిమాండ్‌
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 
ప్రస్తుత మూడు క్రిమినల్‌ చట్టాలను మార్చుతూ తీసుకొచ్చిన మూడు బిల్లులను పరిశీలించిన హోం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ముసాయిదా నివేదికలను స్వీకరించడానికి సోమవారం సమావేశం కానుంది. కొంతమంది ప్రతిపక్ష సభ్యులు ఈ చర్యలను మరింత విస్తృతంగా పరిశీలించడానికి ప్యానెల్‌కు మరింత సమయం ఇవ్వాలని కోరారు. అక్టోబరు 27న హోంస్టాండింగ్‌ కమిటీ మూడు ముసాయిదా నివేదికలను అధ్యయనం చేయడానికి మరికొంత సమయం కావాలని ప్రతిపక్ష సభ్యులు ఒత్తిడి చేయడంతో వాటిని ఆమోదించలేకపోయింది. కొంతమంది ప్రతిపక్ష సభ్యులు ప్యానెల్‌ ఛైర్‌పర్సన్‌ బ్రిజ్‌లాల్‌ పదవీకాలాన్ని మూడు నెలలు పొడిగించాలని, స్వల్పకాలిక ఎన్నికల లాభం కోసం ఈ బిల్లులను బుల్డోజ్‌ చేయడం ఆపాలని కోరారు. అట్టడుగు వర్గాలకు సేవ చేసే పటిష్టమైన చట్టాన్ని రూపొందించడానికి, కమిటీ తదుపరి కొన్ని రోజుల్లో లేదా నవంబరులో తుది నివేదికను ఆమోదించకూడదని సభ్యులు కోరారు. అలా చేస్తే చట్టసభల పరిశీలన ప్రక్రియను అపహాస్యం చేసినట్లు అవుతుందని ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. కమిటీ విస్తృతమైన సంప్రదింపుల ప్రక్రియలో నిమగమైందని, మూడు నెలల గడువును పూర్తి చేస్తుందని బిజెపి వర్గాలు తెలిపాయి. మూడు ముసాయిదాలను ఆమోదించడానికి సభ్యులకు పంపిన నోటీసు ప్రకారం, కమిటీ నవంబరు 6న సమావేశమవనుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది సభ్యులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్యానెల్‌ ముసాయిదా నివేదికలను ఆమోదించవచ్చని వర్గాలు తెలిపాయి. వలస పాలన నాటి క్రిమినల్‌ చట్టాలను పూర్తిగా సవరించాలని కోరుతూ, హోంమంత్రి అమిత్‌షా వర్షాకాల సెషన్‌లో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపిసి), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌-1973, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌-1872 స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియంతో కూడిన మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 11న బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత వాటిని కమిటీ పరిశీలనకు పంపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని లోక్‌సభ కోరింది. కమిటీ మూడు బిల్లుల్లో సవరణల సిఫార్సు చేసే అవకాశం ఉందని, అయితే వాటి హిందీ పేర్లకు కట్టుబడి ఉంటుందని, డిఎంకెతో సహా ప్రతిపక్ష ఎంపిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ఆయా వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత చట్టాలకు ఆంగ్ల పేర్లను కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.