Jul 19,2023 15:22

కుప్పం పట్టణం: మహిళ బతికుండగానే ఆమె పేరుపై నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం (డెత్‌ సర్టిఫికెట్‌) సృష్టించి ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేసి విక్రయించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. బాధిత మహిళ.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి ఆందోళనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఆంబూర్‌కు చెందిన కాంచన వర్మ అనే మహిళ బుధవారం కుప్పంలోని రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. రవికుమార్‌ అనే వ్యక్తి తాను మరణించినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రం సృష్టించి తన ఆస్తిని ఇతరులకు విక్రయించారని ఆరోపించింది. తన భర్త రవివర్మ రెండేళ్ల క్రితమే మరణించారని తెలిపింది. అయితే తాను మఅతిచెందినట్లు పేర్కొంటూ కాంచన రవివర్మ పేరుతో డెత్‌ సర్టిఫికెట్‌ సృష్టించి ఇతరులకు ఆస్తిని విక్రయించారని తెలిపింది. తనకు న్యాయం చేయాలని రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులను కోరింది. 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకట సుబ్బయ్య హామీ ఇవ్వడంతో బాధితురాలు అక్కడి నుంచి వెనుదిరిగింది.