
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు
ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్ (గుంటూరు జిల్లా) : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాద బిజెపిని వ్యతిరేకించాలని వక్తలు పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం బైపాస్‌లోని కెబి భవన్‌లో ఎపి రైతు, కౌలు, వ్య్యకాస సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షతన ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎటువంటి పాత్రా లేని బిజెపి నేడు తామే నిజమైన దేశభక్తులమని, స్వాతంత్ర పోరాట యోధులమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఏనాడూ జాతీయ జెండాను ఎగురవేయని ఆర్‌ఎస్‌ఎస్, మతోన్మాది బిజెపి నేడు కేంద్రంలో స్వాతంత్ర ఉద్యమం గురించి, దేశభక్తి గురించి మాట్లాడడం శోచనీయమన్నారు. దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా మత ఘర్షణలు సృష్టించిందని విమర్శించారు. రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం పోరాటంలో కమ్యూనిస్తు పాత్ర చారిత్రాత్మక పాత్రని గుర్తుచేశారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదని, ప్రజలను మభ్య పెట్టేందుకే నేడు బిజెపి స్వాతంత్య్ర జాతీయవాదం లేవనెత్తుతోందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1942 క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో కేంద్రలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.