
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి:తెలంగాణ ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కృష్ణా జలాలపై పున:సమీక్షకు కేంద్రం ఆదేశాలిచ్చిందని పలువురు వక్తలు అన్నారు. కృష్ణా జలాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనచైతన్య వేదిక ఆధ్యర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిడిపి నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికలలో లబ్దిపొందడం కోసం నాలుగు రాష్ట్రాల వివాదాన్ని రెండు రాష్టాలకు పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. తద్వారా రాయలసీమలోని తెలుగుగంగ, గాలేరు, హంద్రీనీవా ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌లో సభ్యునిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడకపోవడం సరికాదన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకఅష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసమర్థత వల్లే కృష్ణా నదీజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పోలవరం, వెలుగొండ తదితర ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయని, ప్రత్యేక హోదా, విభజన హామీలు గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, తెలుగు రైతు సంఘం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి పాలన్నారు.