
- 25 లక్షల మందిలో 7.50 లక్షల మందికే గుర్తింపు
- 2.48 లక్షల మందికే రుణాలు
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు, వ్యవసాయ శాఖాధికారులు చొరవ చూపడం లేదు. సాగు పెట్టుబడి కోసం కౌలు రైతులు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. రాష్ట్ర రుణ ప్రణాళికలో కనీసం పది శాతం తగ్గకుండా కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని నాలుగేళ్ల క్రితమే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దీంతో, కౌలు రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారు. సాగుకు పెట్టుబడులు పెరుగుతు న్నాయి. ఆదాయం తగ్గిపోతోంది. ప్రభుత్వం నుంచి కౌలు రైతులకు భరోసా కొరవడింది. గత మూడేళ్లతో పోలిస్తే ఆ ఏడాది రుణాలు అందిన కౌలు రైతుల సంఖ్య పెరిగినా అందిన రుణం మొత్తం గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం ఏటా సిసిఆర్‌సి కార్డులు ఇస్తోంది. ఈ ఏడాది 7.50 లక్షల మందికి ఇచ్చింది. వీరిలో 1.46 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. 2011 కౌల్దారి చట్టం స్థానే వైసిపి ప్రభుత్వం 2019లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు ఏ సాయం కావాలన్నా భూ యజమాని అంగీకారం తప్పనిసరిగా మారింది. భూ యజమాని అంగీకారపత్రంతో సాగు ధ్రువీకరణ పత్రాలు (సిసిఆర్‌సి) జారీ చేయాలని నిబంధన విధించింది. భూ యజమానులు ముందుకు రాకపోవడంతో సిసిఆర్‌సి జారీ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడం లేదు. సాగు ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు జారీ చేసినా బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రం మొత్తమ్మీద ఈ ఏడాది 7.50 లక్షల మందికి సిసిఆర్‌సిలు ఇవ్వగా, ఇప్పటి వరకు వారిలో 2.48 లక్షల మంది కైలు రైతులకు మాత్రమే రూ.659 కోట్లు రుణాలు అందాయి. సాధారణ రైతులకు ఈ ఏడాది రాష్ట్రం మొత్తమ్మీద 47 లక్షల మందికి రూ.1,00,035 రుణాలు ఇచ్చారు. కౌలు రైతులకు మాత్రం ఒక్కొక్కరికి కనిష్టంగా రూ.20 వేలు, గరిష్టంగా రూ.30 వేలకు మించి పంట రుణాలు ఇవ్వడం లేదు. ఐదుగురు సభ్యులు ఉండే జాయింట్ లయబులిటీ గ్రూపు (జెఎల్‌బి)నకు గరిష్టంగా రూ.లక్ష మాత్రమే రుణాలు ఇస్తున్నారు. సిసిఆర్‌సిలు లేనివారికి రైతు భరోసా, పంటల బీమా అందడం లేదు. సిసిఆర్‌సిలు ఉన్నా ఒసి కౌలు రైతులకు ప్రభుత్వం రైతు భరోసా వర్తింపజేయడం లేదు. బీమా డబ్బులు భూ యజమాని ఖాతాల్లో జమ అవుతున్నాయి. ప్రభుత్వం సేద్యానికి అందిస్తోన్న సబ్సిడీలు కౌలు రైతుకు అందడం లేదు. పండించిన పంటను అమ్ముకోవాలన్నా గుర్తింపుకార్డు లేక భూ యజమాని పేరుతోనే అమ్ముకోవాల్సి వస్తోంది. కొంతమంది కౌలురైతులు అయినకాడికి ప్రయివేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఇ-క్రాప్, ఇకెవైసి సదుపాయం కౌలు రైతులందరికీ లేకపోవడం వల్ల వీరికి ప్రభుత్వం నుంచి నేరుగా రావాల్సిన వివిధ సదుపాయాలు అందడం లేదు.


కౌలు రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలి
భూ యజమానులకు రుణాలు ఇస్తున్న బ్యాంకర్లు వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకు రుణాలు ఇవ్వకపోవడం దారుణం. భూ యజమానికి భూమిపై రుణం ఇచ్చి పంటలపై కౌలు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద రుణాలు ఇవ్వాలి. ఎకరాకు గరిష్టంగా రూ.1.60 లక్షల రుణం మంజూరు చేయాలి. ఒక్కో జెఎల్‌బి గ్రూపునకు రూ.8 లక్షలు హామీలేని రుణం ఇవ్వాలి. పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులను బ్యాంకర్లు, వ్యవసాయ శాఖాధికారులు విస్మరించడం తగదు. వారికే అన్ని సదుపాయాలూ కల్పించాలి. ప్రభుత్వం సిసిఆర్‌సి ఇచ్చిన ప్రతి కౌలు రైతుకూ ఇకెవైసి, ఇ-క్రాప్ చేసి పంట కొనుగోలు, బీమా సదుపాయాలు వర్తింపచేయాలి.
వై.రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు,
ఎపి కౌలు రైతు సంఘం