
ప్రజాశక్తి - వాల్మీకిపురం(అన్నమయ్యజిల్లా) : ఆర్టీసీ బస్సు ఢీకొని కౌలు రైతు మృతిచెందిన సంఘటన సోమవారం వాల్మీకిపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని చింతపర్తి బీసీ కాలనీకి చెందిన రైతు చంద్ర (49)రాములవారిపల్లె సమీపంలో కొంత పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం పొలాల వద్ద నుండి పాలు తీసుకుని ద్విచక్రవాహనంపై యర్రగుంట్ల బావి గ్రామానికి వెళ్తూండగా అదేసమయానికి నిమ్మనపల్లె నుండి చింతపర్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వచ్చి ఢకొీంది. ఈ ప్రమాదంలో కౌలు రైతు చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ బిందుమాధవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాల్మికీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.