Dec 09,2022 21:35
  • ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఈనెల 12న విజయవాడ అశోక్‌నగర్లోని పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎమ్‌డి కార్యాలయం ముందు ధర్నాను చేపడతామని ఎపి రైతు సంఘం, కౌలురైతు సంఘం నాయకులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాధాకృష్ణ, ఎం.హరిబాబు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గోనెసంచులు లేవనే సాకుతో కొనుగోళ్లు ఆపడం తగదని విమర్శించారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు వద్దనే ధాన్యం మిగిలిపోయిందని, ఇపుడు తుఫాన్‌ హెచ్చరికలు రావడంతో తడిచిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సిసిఆర్‌సి కార్డులు లేవని ఈ క్రాపింగ్‌ కాలేదనే పేరుతో కౌలురైతుల వద్ద ధాన్యాన్నీ కొనుగోలు చేయడం లేదని తెలిపారు. వారికీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తక్షణం ధాన్యం కొనుగోళ్లను చేపట్టకపోతే ఈ నెల 12న పెద్దఎత్తున రైతులను సమీకరించి ధర్నాను చేపడతామని తెలిపారు.