
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:లఖింపూర్ ఖేరీలో రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం బ్లాక్‌డేగా పాటించారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ధర్నా చౌక్‌లో నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతు ఉద్యమ విరమణ సందర్భంగా లఖింపూర్ ఖేరీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామని లిఖిత పూర్వక హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం దానిని తుంగలో తొక్కిందని విమర్శించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని చేసిన రైతాంగ ఉద్యమంలో 75 వేల మందిపై కేసులు పెట్టారని, ఆ కేసులను ఎత్తివేస్తామని చెప్పి ఇంత వరకు ఏ చర్యలూ తీసుకోలేదని ఆయన విమర్శించారు. మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
అఖిల భారత కిసాన్‌సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ.. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సూచించిన సిఫార్సుల ప్రకారం సి టు ప్లస్ 50 శాతం కలిపి మద్దతు ధరలను ప్రకటించి, వాటికి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కేరళ ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఒక క్వింటా ధాన్యానికి రూ.750 అదనంగా బోనస్ ఇస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించకపోవడం అన్యాయమన్నారు. రైతాంగ ఆత్మహత్యల నివారణకు కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. మతతత్వ విధానాలను అవలంభిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని ఓడించడమే కార్మిక, కర్షకుల కీలక కర్తవ్యమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే విధానాలను వైసిపి ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు.
ఎపి రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ.. రైతులకు నష్టం చేసే విద్యుత్తు బిల్లు 2020ను వెంటనే ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు పెట్టే విధానానికి స్వస్తి పలకాలని అన్నారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ రవీంద్రనాథ్, జి ఓబులేషు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం చేసే విధానాలను తీసుకురావడంతోపాటు కార్మికుల సంక్షేమాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు డి హరినాథ్, కొల్లా రాజమోహన్, వి కృష్ణయ్య, పి జమలయ్య, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, వెలగపూడి ఆజాద్, ఎం ఉమామహేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ నాయకులు జాస్తి కిశోర్‌బాబు, కె బసవయ్య, శ్రీధర్, సాంబశివరావు, తదితరులు పాల్గోన్నారు.