Oct 01,2023 21:36

రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు ( ప్రకాశం జిల్లా) :గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైనట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య విమర్శించారు. ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని 15 నెలలు దాటినా నేటికీ మరమ్మతులు పూర్తి చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గుండకమ్మ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టాలని, కాలువల్లో పూడికను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు నుంచి గుండ్లకమ్మ జలాశయం వరకు ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రను ఆచార్య రంగా కిసాన్‌ సంస్థ కన్వీనర్‌ చుంచు శేషయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు రూ.11 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ. 3,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు గురికావడంతో సుమారు 80 వేల ఎకరాలల్లో సాగు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. కనీసం ఆరుతడి పంటలకు నీరు వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అనంతరం పాదయాత్ర నాగులుప్పలపాడు నుంచి పోతవరం, నిడమానూరు, గ్రోత్‌ సెంటరు మీదుగా గుండ్లకమ్మ జలాశయం వరకూ సాగింది. ఈ కార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌కె.మాబు, వి. బాలకోటయ్య, ఉపాధ్యక్షులు టి. శ్రీకాంత్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు, ఉపాధ్యక్షులు జె. జయంతిబాబు, చుండూరి రంగారావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జాలా అంజయ్య, వివిధ గ్రామాల రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.