Dec 18,2022 08:33
  • ప్రజలకు దక్కని ఊరట
  • ఫలితమివ్వని కేంద్రం చర్యలు

న్యూ ఢిల్లీ : ద్రవ్యోల్భణం దిగివస్తోందంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎలా ఉన్నప్పటికీ ఆహారధాన్యల ధరలు మాత్రం పైపైకే దూసుకుపోతున్నాయి. దీంతో సాధారణ ప్రజానీకం తమ కష్టార్జితంలో అధికభాగాన్ని తిండి గింజల కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దేశ వ్యాప్తంగా బియ్యం, గోధుమల ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. వీటి ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా చేతులెత్తేసింది. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం పరిధిలోకి వచ్చే మిగిలిన వాటి ధరలు తగ్గినప్పటికీ ప్రజానీకానికి ఫలితం కనిపించడంలేదు. ప్రభుత్వం మాత్రం ధరలు తగ్గుతున్నాయంటూ, ఆహార ద్రవ్యోల్భణం అదుపులోకి వచ్చేసిందంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తోంది.
 

                                                                         ఎంత పెరిగాయి...?

తిండిగింజల (బియ్యం, గోధుమలు) ద్రవ్యోల్భణం అక్టోబర్‌ నెలలో 12.08 శాతం ఉండగా, నవంబర్‌ నెలాఖరుకు 12.96 శాతానికి చేరింది. డిసెంబర్‌లోనూ వీటి ద్రవ్యోల్భణం పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో 2.8శాతంగా ఉన్న బఇయ్యం ద్రవ్యోల్భణం ఏప్రిల్‌లో 3.96 శాతానికి, అక్టోబర్‌లో 10.21శాతానికి, నవంబర్‌లో 10.51 శాతానికి చేరింది. డిసెంబర్‌లో దాదాపుగా 11 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా. గోధుమల ద్రవ్యోల్భణం కూడా ఈ ఏడాది ప్రారంభంలో 5.1 శాతం ఉండగా, ఏప్రిల్‌ నాటికి 9.59 శాతానికి, అక్టోబర్‌ నెలలో 17.64 శాతానికి, నవంబర్‌లో 19.67 శాతానికి చేరింది. డిసెంబర్‌ నెలాఖరుకు 20శాతానికి గోధుమల ద్రవ్యోల్భణం చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. బియ్యం, గోధుమల ధరలు పెరగడం ఇదే మాదిరి కొనసాగితే ప్రజానీకానికి మరిన్ని ఇక్కట్లు తప్పవు.
 

                                                              ఇతర ఆహార ధాన్యల పరిస్థితి ఏమిటి ?

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం బియ్యం, గోధుమలు మినహా ఇతర ఆహార ధాన్యాల ధరలు ఈ ఏడాది తగ్గుముఖం పెట్టాయి. ఫలితంగా మొత్తం ద్రవ్యోల్భణంతో పాటు, ఆహారధాన్యాల ద్రవ్యోల్భణం కూడా తగ్గుముఖం పెట్టింది. దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్భణం ఆర్‌బిఐ నిర్ధేశించిన ఆరుశాతానికన్నా దిగివచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇంత ద్రవ్యోల్భణం ఈ స్థాయికి తగ్గడం గత 11 నెలల్లో ఇదే మొదటిసారి. అదే విధంగా ఆహారద్రవ్యోల్భణం కూడా 11 నెలల కనిష్టం 4.67శాతానికి దిగివచ్చిందని కేంద్రం తెలిపింది. బియ్యం, గోధుమలు మినహాయించి ఇతర ఆహారధాన్యల ధరలు తగ్గడమే ఈ తరుగుదలకు కారణం. అయితే, అక్టోబర్‌, నవంబర్‌ నెలలో వాటి ధరలు కూడా పెరిగాయి. సెప్టెంబర్‌ నెలలో వీటి ద్రవ్యోల్భణం 1.37శాతం ఉండగా, అక్టోబర్‌లో 1.99 శాతానికి చేరింది. నవంబర్‌లో కొంచెం తగ్గినా 1.70శాతంగా ఉంది. దీంతో రాబోయే రోజుల్లో వీటి ధరలు ఎలా ఉంటాయన్న అంశం ఆందోళన కలిగిస్తోంది. బియ్యం, గోధుమలతో పాటు వీటి ధరలు కూడా పెరిగే సామాన్యుల పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది.
 

                                                                           ఎందుకీ స్థితి ?

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా బియ్యం, గోధుమల ఉత్పత్తి తగ్గింది, అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్‌ వరకు సేకరించిన ధాన్యం గత ఏడాదితో పోలిస్తే 3.8 మిలియన్‌ టన్నులు తక్కువ. దీంతో ప్రైవేటు వ్యాపారులు కూడా నిర్ధేంశిచుకున్న లక్ష్యాల కన్నా తక్కువగానే ధాన్యం కొనుగోలు చేశారు. బీహార్‌, జార్ఖాండ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లలో దాన్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. మార్కెట్‌లో డిమాండ్‌ మేరకు బియ్యం అందుబాటులో లేకపోవడంతో ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం గోధుమలపై కూడా పడింది. అదే సమయంలో గోధుమల ఉత్పత్తి తగ్గడంతో పాటు, అంతర్జాతీయ పరిణామాలు కూడా గోధుమలకు డిమాండ్‌ను పెంచాయి. మరోవెపు ఈ ఏడాది ఖరీఫ్‌లో కూడా గత ఏడాదితో పోలిస్తే 6.05శాతం ఉత్పత్తి తగ్గుతుందని భావిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో కూడా బియ్యం, గోధుమల ధరలు మరింత పెరగనున్నాయి.
 

                                                               ఆరేళ్ల కనిష్టానికి గోధుమ నిల్వలు

దేశంలో గోధుమల నిల్వలు ఆరేళ్ల కనిష్టానికి చేరాయి. ఒకవైపు మార్కెట్‌లో గోధుమ ధరలు అనూహ్యంగా పెరుగుతుండగా మరోవైపు ఈ పరిణామం చోటుచేసుకుంది. భారత ఆహార సంస్థ (ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెంట్రల్‌ పూల్‌లో 19.02 మిలియన్‌ టన్నుల గోధుమలు మాత్రమే నిల్వ ఉన్నాయి. 2016 డిసెంబర్‌లో దేశంలో గోధుమల నిల్వలు 16.5 మిలియన్‌ టన్నులకు పడిపోయాయి. ఆ తరువాత ఈ స్థాయికి నిల్వలు పడిపోవడం ఇదే మొదటిసారి. దీంతో ఆహార రంగ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, అధికారయంత్రాంగం మాత్రం ప్రస్తుతం అవసరమని అంచనా వేసిన దానికన్నా అధికంగానే నిల్వలు ఉన్నాయని చెపుతున్నారు. అదే సమయంలో పార్లమెంటులో చేసిన ప్రకటనలో గోధుమ నిల్వలు ఇంకా తగ్గే అవకాశం ఉందని,జనవరి ఒకటవ తేదికి 15.9 మిలియన్‌ టన్నులకు పడిపోతాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే అవసరమైన కనీస నిల్వల కన్నా ఎక్కువగానే ఉంటాయని తెలిపింది. సెంట్రల్‌ పూల్‌లో జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం సంక్షేమ పథకాలకు, అదేవిధంగా ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన(పిఎంజికెఎవై) పథకం కింద లభ్ధిదారులకు సరఫరాకు ఎటువంటి ఆటంకం ఉండదని కేంద్రం వివరించింది. అయితే, పిఎంజికెఎవై పథకాన్ని డిసెంబర్‌ 31వ తేది తరువాత కూడా కొనసాగిస్తారా, నిలిపివేస్తారా అన్న విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే, ఒక వేళ పథకాన్ని కొనసాగిస్తే కొరత తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో గోధుమల సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ శాఖ చెబుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 28.65 మిలియన్‌ హెక్టార్లలో గోధుమలు సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 0.82 మిలియన్‌ హెక్టార్లు ఎక్కువ. అదేసమయంలో సాధారణంగా ప్రతి సంవత్సరం 30.5 మిలియన్‌ హెక్టార్లలో గోధుమలు సాగు అవుతుండటం గమనార్హం.