Mar 13,2023 07:58

చుట్టూ చీకటే అలముకొని ఉంది
ఇంకా తిట్టుకుంటూ కూచోకు
ఏ మూలనో ధగధగలాడుతున్న
చిరుదీపపు వెలుగు శ్వాసల్ని గుర్తించు
రెండు చేతులూ కలిపి కదిలి
క్రాంతి దారిని నిర్మించు ...

అటు స్వార్థం బుసలు కొడుతోంది
అధికారం రంకెలేస్తోంది
కట్టు తెగిన కట్టలు గెలుపును హూంకరిస్తున్నాయి
ఎక్కి తొక్కటానికి నీ భుజాలను అప్పగిస్తావో
గెలిచి నిలవటానికి సన్నద్ధమవుతావో ...

ఒక్కసారే వస్తుంది వెలుగుల వసంతం
దిక్కులు పిక్కటిల్లే నీ గెలుపునకు అవకాశం
చీకట్లో చిక్కుకోని చైతన్య ప్రవాహమే
రేపటి క్రాంతుల కదన కుతూహలం !
 

- శాంతిమిత్ర