Jul 30,2023 07:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఉన్న 62ను 65 ఏళ్లకు పెంచుతూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు శనివారం జిఓ 39ను విడుదల చేశారు. యుజిసి స్కేల్‌ ప్రకారం వేతనం తీసుకుంటున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6వ కేంద్ర వేతన సంఘం ఉపాధ్యాయుల ఉద్యోగుల విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసింది. యుజిసి స్కేళ్లను అమలు చేస్తున్న విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు అదే విధంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో అధ్యాపకుల ఉద్యోగుల విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఎపిఎస్‌సిహెచ్‌ఇఎల్‌ సెక్రటరీ అభిప్రాయపడ్డారు.