ఇంటర్నెట్‌డెస్క్ : ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందడానికే భయపడిపోతున్నారట. ఎందుకు భయం? ఎంచక్కా పదవీ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు కదా..! అని అనుకుంటాం. కానీ చేయడానికి పని లేక, ముందు జాగ్రత్తగా పదవీ విరమణ అనంతరం జీవించడానికి సరిపడా డబ్బులు కూడబెట్టుకోకపోవడం వల్ల ఎంతో ఆందోళనకు గురవుతున్నారని తాజా సర్వేల్లో తేలింది.
పది మందిలో తొమ్మిది మంది పదవీ విరమణ కంటే ముందు పొదపు చేసుకోనందుకు చింతిస్తున్నట్లు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జరిపిన తాజా సర్వే తెలిపింది. మ్యాక్స్ లైఫ్ సర్వేనే కాదు.. ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (ఐఆర్‌ఐఎస్) చేసిన సర్వేలో కూడా ఇదే తేలింది. రిటైర్మైంట్ అనంతరం ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నారా? ఆర్థికంగా సురక్షితంగా జీవిస్తున్నారా లేదా వంటి విషయాల్ని కనుక్కొనుందకు ఐఆర్‌ఐఎస్ దాదాపు 28 నగరల్లో 2,093 మంది అభిప్రాయాలను తీసుకుందట. ప్రధానంగా ఈ రెండు సర్వేలు పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై ఉద్యోగులు శ్రద్ధచూపెడుతున్నారని పేర్కొన్నాయి. నేటికాలంలో వయసు జస్ట్ సంఖ్య మాత్రమే. జీవన పరిస్థితులకనుగుణంగా ఆర్థిక అవసరాల రీత్యా ఉద్యోగులు పని చేయడానికే సిద్ధపడుతున్నారు. దీంతో వారి పదవీ విరమణ వయసు పెంచొచ్చు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే.. అస్సలు పనిచేయలేని వయసు వచ్చేదాకా దాదాపు 73 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసుని పెంచితే బాగుంటుందని చెప్పారు. సరే వయసు సంగతి అటుంచితే.. రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఎలా ఉండాలి? అని అడిగితే.. రకరకాల సమాధాలు వచ్చాయట. కొంతమందేమో.. ఇప్పటిదాకా పనితోనే సరిపోయింది.. కుటుంబం కోసం అస్సలు టైమ్ వెచ్చించలేదు. రిటైర్మెంట్ తర్వాత కచ్చితంగా కుటుంబంతో గడపాలనుకుంటున్నారని చెప్పారు. మరికొంతమందేమో ఇప్పటికైనా ఒత్తిడి నుంచి బయటపడ్డాం అని.. ఎవరి మీద ఆధారపడకుండా... స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉండాలని కొందరు అన్నారు. రిటైర్మెంట్ అనంతరం ప్రకృతిని ఆస్వాదించేందుకు దూరపు ప్రయాణాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఇక ఈ అభిప్రాయాలకు భిన్నంగా మరికొంతమంది సరిపడా పని లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్యసమస్యలు వస్తాయి. పదవీ విరమణ తర్వాత అనారోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకుంటాం అని చెప్పారు. ఇలాంటివే కాదు.. జీవితం మీద ఎలాంటి ఆశలు లేకుండా.. నిరుత్సాహంగా ఉండడం, తమ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని లోలోపల బాధపడడం, జీతం లేకపోవడం వల్ల పొదుపు చేయలేపోవడం వల్ల పూర్తిగా పిల్లల మీద ఆధారపడడం నచ్చక మానసిక వేదనకు గురవుతున్నట్లు ఈ సర్వేల్లో తేలింది.
ముందుగానే పొదుపు
మరో ఐదేళ్లలో పదవీ విరమణ కాబోతున్న ఉద్యోగుల్లో ముగ్గురిలో ఒకరైనా తమ పొదుపు తగ్గుతుందని ఎక్కువగా ఆలోచిస్తున్నారట. ఇక ఐదుగురిలో ఇద్దరు మాత్రం ముందుగా ఎలాంటి పెట్టుబడులకు మొగ్గుచూపడం లేదట. ఇక ఎక్కువ శాతం మంది విరమణ అనంతరం తమని పిల్లలు చూసుకుంటారనే భరోసా వ్యక్తం చేశారట. అయితే ఏది ఏమైనా.. ఎలాంటి ఆర్థిక పరిస్థితులున్నా.. 50 ఏళ్లు పైబడిన వారు ముందుగానే పొదుపు చేయనందుకు చింతిస్తున్నట్లు ఈ సర్వేల్లో తేలింది. ఎవరో ఒకరో.. ఇద్దరో తమ కెరీర్ ప్రారంభం నుంచే.. పొదుపు చేశారని ఈ సర్వేలు వెల్లడించాయి.
మహిళల కంటే.. పురుషులే హ్యాపీ
పదవీ విరమణ అనంతరం మహిళల కంటే.. పురుషులే సంతోషంగా ఉన్నట్లు ఈ సర్వేల్లో తేలింది. ఆర్థిక విషయాల్లో పురుషులతో సమానంగా మహిళలు పొదుపు చర్యలు చేపట్టినప్పటికీ.. పదవీ విరమణ అనంతరం దాదాపు 60 శాతం మంది పురుషులు ఎంతో సంతోషంగా జీవితం సాగిస్తున్నట్లు మ్యాక్స్ లైఫ్, ఐఆర్‌ఐఎస్ సర్వేలు తెలిపాయి. ఏది ఏమైనా రిటైర్మెంట్ అనేది కాల పరిమితికి తగ్గట్టుగా నిబంధనలకనుగుణంగా పదవీ విరమణ పొందినా.. ఆ తర్వాత కచ్చితంగా ప్రశాంతంగా జీవించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు బ్యాంక్‌లో చేసిన పొదుపు వల్ల లాభాలు గడించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.