Sep 12,2022 21:22

ముంబయి : దేశంలో అధిక ధరలు సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్నాయి. వరుసగా మూడు నెలలుగా తగ్గినట్టుగానే తగ్గిన వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) మళ్లీ ఆగస్టులో 7 శాతానికి పెరిగింది. ఇంతక్రితం జులై మాసంలో ఇది 6.71 శాతంగా నమోదయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా 7.79 శాతానికి ఎగిసి ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. హెచ్చు ధరలను అరికట్టడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఇటీవల మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఆయినా ధరలు తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళనకరం. దేశంలో ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య కట్టడి చేయాలనేది ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దీనికి భిన్నంగా గడిచిన ఎనిమిది నెలలుగా ద్రవ్యోల్బణం ఆరు శాతం ఎగువన నమోదవుతూనే ఉంది. దీంతో భవిష్యత్తులో ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశాలున్నాయి.
సిపిఐలో దాదాపు సగం వరకు వాటా అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సూచీదే. గడిచిన నెలలో గోదుమలు, బియ్యం, పప్పుల ధరలు భారీగా పెరగడంతో అహారోత్పత్తుల ధరల సూచీ 7.62 శాతానికి ఎగిసింది. ఇంతక్రితం జులైలో ఈ సూచీ 6.69 శాతగా నమోదయ్యింది. వంట నూనెలు, కూరగాయల ధరలు వరుసగా 4.62 శాతం, 13.25 శాతం చొప్పున పెరిగాయి. గడిచిన ఆగస్టులో కూడా సిపిఐ 7 శాతం దిగువన చోటు చేసుకోవచ్చని అనేక ఎజెన్సీలు అంచనాల కంటే అధిక ద్రవ్యోల్బణం నమోదు కావడం ఆందోళనకరం. మధ్యస్థ కాలానికి రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలని ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడంలో వరుసగా గడిచిన 35 నెలల నుంచి విఫలం అవుతూనే ఉంది. ధరల కట్టడిలో ఆర్‌బిఐ, ప్రభుత్వం విఫలమవుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న వినియోగ ధరల సూచీ (సిపిఐ) ఆధారిత హెచ్చు ద్రవ్యోల్బణం ఆమోదయోగ్యం కాదని ఆర్‌బిఐనే స్వయంగా పేర్కొంది. ఆగస్టు తొలి వారంలో జరిగిన ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపిసి) భేటీలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అధిక ద్రవ్యోల్బణ కట్టడి కోసమే రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. అధిక ధరలు ప్రజల పొదుపు శక్తిని హరించివేయడంతో పాటుగా ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.