Oct 30,2023 16:01

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :వాల్తేరు డివిజన్‌ మెయిన్‌ లైన్‌లోని కంటకాపల్లి - అలమండ మధ్య ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను 19 గంటల్లోనే అధికారులు పునరుద్ధరించారు. ప్రమాదం జరిగిన అరగంటలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సౌరభ్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. అడ్మినిస్ట్రేషన్‌, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ఫోర్స్‌ బృందాలు, రెస్క్యూ అంబులెన్స్‌లు, యాక్సిడెంట్‌ రిలీఫ్‌ రైళ్లును, వైద్య బృందాలను సంఘటనా స్థలానికి తరలించారు. ట్రాక్‌ పునరుద్ధరణ పనుల్లో భాగంగా దెబ్బతిన్న కోచ్‌లను తొలగించారు. పునరుద్ధరణ చర్యలను ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ మనోజ్‌ శర్మ, సీనియర్‌ అధికారులు పర్యవేక్షించారు. మెయిన్‌లైన్‌లో రైలు సేవల పునరుద్ధరణ కోసం వెయ్యి మందికి పైగా కార్మికులు, సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన సూపర్‌వైజర్లు కృషి చేశారు. అధునాత క్రేన్‌లను, యంత్రాలను ఉపయోగించారు. సోమవారం ఉదయం 11.45కి ట్రాక్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు ఇవ్వడంతో మధ్యాహ్నం 2:23 గంటలకు డౌన్‌లైన్‌లో గూడ్స్‌ రైలును, 2:36 గంటలకు అప్‌లైన్‌లో భువనేశ్వర్‌ - బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నడిపారు. ప్రమాదం కారణంగా 47 రైళ్లు రద్దయ్యాయి. 24 రైళ్లు దారి మళ్లించబడ్డాయి. ఎనిమిది రైళ్లు షార్ట్‌ టెర్మినేట్‌ చేయబడ్డాయి. ఎనిమిది రైళ్లను రీషెడ్యూల్‌ చేశారు.