- గాలిలో దీపంలా ప్రయాణికుల ప్రాణాలు
- కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదానికి లోకో పైలట్ 'సిగల్ ఓవర్ సీ' కారణమా ?
- 2017 నుంచి భద్రతా నిధులకు కోత పెట్టిన మోడీ సర్కారు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : దేశ రైల్వేలో భద్రతా సిబ్బంది కొరత, సిగలింగ్ వ్యవస్థ ఆపరేషన్స్ నిర్వహణ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో, గడిచిన ఆరేళ్లుగా తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని వాల్తేరు డివిజన్‌లో ప్రమాదాలు క్రమేపీ పెరుగుతున్నాయి. భారీ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ సుమారు రెండు వేల మంది ఇంజనీరింగ్ సిబ్బంది కొరత ఏళ్ల తరబడి వెంటాడుతోంది. 2013లో విజయనగరం జిల్లా గొట్లాంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక బోగీలో పొగ వచ్చిందని, ఏదో ప్రమాదం జరగబోతుందనే కంగారులో రైలు గొలుసు లాగి పక్కనే మరో రైల్వే ట్రాక్‌లోకి ప్రయాణికులు వెళ్తున్న క్రమంలో ఆ ట్రాక్‌పై వచ్చిన రైలు ఢకొీనడంతో మృతి చెందారు. 2016లో కూనేరులో హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 41 మంది మరణించారు. దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటైన ఒడిశాలోని బాలాసూర్‌లో ఎదురెదురుగా వచ్చిన రైళ్లు ఢకొీన్న ఘటనలో 298 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. తాజాగా వాల్తేరు డివిజన్ పరిధిలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ వద్ద ఆదివారం రాత్రి రాయగడ-విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైలు పలాస పాసింజరును ఢకొీనడంతో సుమారు 13 మంది విగతజీవులయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, మోడీ ప్రభుత్వం రైల్వేల భద్రతను పట్టించుకోకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు ప్రాథమిక విశ్లేషణ ఇలా ఉంది. వాల్తేరు డివిజన్‌లో ప్రధాన, నిత్యం బిజీగా ఉండే రైల్వే లైను ఇది. మూడు రైల్వే లైన్లు ఇక్కడ ఉన్నాయి. మధ్య లైనులో ఈ తాజా ఘటన జరిగింది. హౌరా-చెన్నరు వెళ్లే రైళ్లు, కోరమండల్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్, మెయిల్, సరుకు రవాణా గూడ్స్ రైళ్లు ఈ లైన్లోనే వెళతాయి. వాల్తేరు రైల్వేలో కీలకమైన మూడు లైన్లు ఇవే అయినప్పటికీ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆదివారం ఘటనపై రైల్వే ప్రాథమిక అంచనాలు ఇలా ఉన్నాయి.
స్నిగల్ వ్యవస్థల్లో రెడ్ (ఎరుపు)-1, గ్రీన్ (ఆకుపచ్చ)-2 సిగల్ లైట్లు ఉంటాయి. పూర్తిగా రెడ్ ఉంటే ఆగడం, గ్రీన్ ఉంటే వెళ్లడం చేయాలి. పసుపు లైట్లు రెండు ఉంటాయి. అవి రెండూ వెలిగితే ప్రొసీడ్ (2 సెక్షన్లు) లైన్లు క్లియర్‌గా ఉన్నాయని అర్థం. కానీ, ఒక పసుపు లైటు వెలిగి ఉంటే ఒక సెక్షన్ క్లియర్ అని, ఆగిఆగి వెళ్లాలని సంకేతం. తాజాగా జరిగిన ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్ కాస్త వేగంగా ప్రొసీడ్ అయ్యారని అంచనా వేస్తున్నారు. దీన్నే సిగల్ ఓవర్ సీగా రైల్వే పరిభాషలో పేర్కొంటున్నారు.
సిఆర్‌ఎస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం
కంటకాపల్లి ఘటనపై ఇన్వెస్టిగేషన్‌కు కమిషనర్ రైల్వే స్టేఫ్టీ (సిఆర్‌ఎస్)ను కేంద్రం సోమవారం నియమించింది. ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం వాల్తేరు డివిజన్‌లో ఈ మేరకు పరిశీలన చేయనుంది. మూడు రోజుల తర్వాత పేపర్ నోటిఫికేషన్ కూడా ఆనవాయితీ ప్రకారం విడుదల చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరైనా ఈ ఘటనపై వివరాలు అందజేసేవారుంటే ఫలానా చోట కలవాలని ఈ కమిటీ తెలియపరచనుంది. ప్రజలు, రైల్వే సిబ్బంది, ప్రయాణికులందరినీ ఇలా విచారణ చేశాక పది రోజుల తర్వాత ఈ ప్రమాద కారణాన్ని వెల్లడించనున్నారు.
నానాటికీ తీసికట్టుగా భద్రత
ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వేల్లో లోకో పైలట్లకు అధిక పని ఒత్తిడి ఉందని కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి ముందే కేంద్రానికి రైల్వే బోర్డు నివేదించింది. ఈస్ట్ కోస్ట్ పరిధిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ట్రాక్‌లకు ఇరువైపులా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని బోర్డు చెప్పినా రైల్వే శాఖకు పట్టలేదు. లోకో పైలట్ల పని 12 గంటలకు మించకుండా ఉండాలని సూచించింది. కానీ, 12 గంటలపైనే వీరితో పని చేయించుకుంటోంది. సదరన్ రైల్వే పరిధిలో 392 లోకో పైలట్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 2017 నుంచి 2021 కాలానికి కేంద్ర ప్రభుత్వం భద్రతా నిధి కింద రూ.20 వేల కోట్లు ఏర్పాటు చేయాలి. కానీ, రూ.4 వేల కోట్ల మేరే జమ చేసింది. ఈ విషయంలో కేంద్ర వైఫల్యంపై కాగ్ 2021లో తప్పుపట్టింది.