- ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు: కేంద్ర క్రీడల మంత్రి
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బిజెపి ఎంపి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షులు బ్రిజ్ భూషణ్‌ను ఆ పదవినుంచి తప్పిస్తే సరిపోదని, ఫెడరేషన్‌ను రద్దు చేయాలంటూ రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేపట్టిన ఆందోళన గురువారం కొనసాగింది. ఈ ఆందోళనలో ఒలింపిక్స్ పతక విజేతలు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, సాక్షి మలిక్‌తోపాటు సంగీత ఫొగాట్ సహా పలువురు రెజ్లర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భజరంగ్ పునియా మాట్లాడుతూ.. దేశం కోసం మేం పోరాడుతున్నప్పుడు.. మా హక్కుల కోసం పోరాడుతాం అన్నాడు. బ్రిజ్ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే.. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఏకంగా ఫెడరేషన్‌ను రద్దు చేస్తేనే మహిళా రెజర్లకు రక్షణ ఉంటుందన్నాడు. తమవద్దకు ఇప్పటికి ఐదారుగురు మహిళా రెజర్లు సాక్ష్యాలతో ముందుకు వచ్చారని, వారికి సరైన న్యాయం చేయకపోతే మహిళలెవ్వరూ రెజ్లింగ్ క్రీడపై ఆసక్తి చూపరని తెలిపాడు. ఇక సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. తమకు న్యాయం చేస్తామని హామీ మాత్రమే వచ్చిందని, ఆ నిర్ణయంపై ఎవ్వరూ సంతృప్తిగా లేరని, ఏకంగా సమాఖ్యనే రద్దుచేయాలని కోరుకుంటున్నామన్నారు. పోగాట్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సారు)ను తాము సంప్రదించని మాట వాస్తవమేనని, కోచ్, ఫిజియోలకు లైంగిక వేధింపుల విషయం చెబితే అది మళ్లీ ఫెడరేషన్ దృష్టికి వెళ్తుందని భావించామని, దీంతో తాము మరింత కష్టాల్లో పడతామని చెప్పలేదన్నారు.
- మధ్యవర్తిగా బబితా ఫొగాట్..
మాజీ రెజ్లర్, బిజెపి నేత బబితా ఫొగాట్ ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా గురువారం ధర్నా ప్రాంతానికి వచ్చి రెజ్లర్లతో మాట్లాడారు. ''అథ్లెట్లకు ప్రభుత్వం మద్దతుగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా'' అని తెలిపారు. మరోవైపు ఆందోళన చేస్తోన్న రెజ్లర్లకు పలువురు ప్రతిపక్ష రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు.
- కమిటీ యోచనలో కేంద్రం..
బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర క్రీడల శాఖ స్పందిస్తూ.. 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్‌ఐని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే జాతీయ క్రీడా నియమావళి ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో ఇద్దరు మహిళా సభ్యులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.










