భద్రాచలం : భద్రాచలం వద్ద శనివారం ఉదయం వరద ప్రవాహం 55-58 అడుగులకు చేరింది. చింతూరు వద్ద 42 మీటర్లకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత వరదల కాలంలో భద్రాచలం : 52 మీటర్లు / 63 అడుగులు, చింతూరు : 44 మీటర్లు ఉన్న స్థితిలో బి.సి కాలనీ, ఎస్.టి కాలనీ, సినిమా హాల్ సెంటరు పరిధిలో ఇళ్ళ వద్దకు వరద ప్రవాహం చేరుకునే స్థితి ఉండేది. ఎగువన వరద ప్రభావంతో గతంలో భద్రాచలం వద్ద 60 అడుగులకు వరద ఉన్నప్పుడు ఇళ్ళలోకి వరదనీరు చేరేది. ఈ సంవత్సరం ఆ గ్రామాల్లో వరద నీరు 51 అడుగులకు వచ్చినట్టు స్థానికులు తెలియచేసి వాపోతున్నారు.
తగ్గిన వర్షపాతం..
ప్రస్తుతం వరద ప్రవాహ ఉధృతి వేగంగా లేదు. కానీ ఎగువ నుండి వరద ఎక్కువగా చేరుతోంది. ప్రవాహ వేగం కొంత పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహాన్ని ప్రభావితం చేసేలా వర్షపాతం నమోదు కాకపోవడం శుభ సూచికం. మొన్నటిలా తెలంగాణ నీటిపారుదల శాఖ సమన్వయ పనితీరు కొనసాగితే ప్రస్తుతానికి ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేనట్టే.
పునరావాసాలు..
పక్క మండలాల పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఖాళీలు లేక ప్రజలు ప్రభుత్వ భవనాల పక్కన తాత్కాలిక గుడారాల ఏర్పాటు చేసుకున్నారు. టార్పలిన్లు లేని వారు ఇబ్బందులకు గురవుతున్నారు.
వరద పెరిగితే...
ప్రస్తుతానికి బి.సి కాలనీ, ఎస్.టి కాలనీ, సినిమా హాల్ సెంటర్ ప్రాంత ప్రజలు ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడలేదు. అప్రమత్తంగా ఉన్నారు. వర్షపాతం పెరిగి అకస్మాత్తుగా సామాను సదురుకునే సందర్భం కలిగితే కంగారుపడాల్సిన అవసరం లేకుండా ముందస్తుగా సంసిద్ధంగా ఉంటే మంచిది అన్నట్లు వారంతా సిద్ధంగా ఉన్నారు. చింతూరు పునరావాస కాలనీలలో ఖాళీ ఉంది కాబట్టి చివరి ప్రాంత పరిధిలో నివసించే వారు అక్కడకు చేరుకునేందుకు ప్రయాసపడుతున్నారు.










