Nov 15,2022 13:29
  • ఇంటికి రూ.ఐదు లక్షల జిఒ పెండింగ్‌
  • 436 ఇళ్లకు పార్ట్‌ బిల్లుల చెల్లింపులకు నో
  • 855 ఎకరాల్లో తొలగని ఇసుక దిబ్బలు
  • అమలుకు నోచనిసిఎం హామీ

ప్రజాశక్తి - కడప ప్రతినిధి : 'అన్నమయ్య' నిర్వాసితుల పునరావాసం పునాదులకే పరిమితమైంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ఇస్తామని సిఎం జగన్‌ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. కొంతమంది నిర్వాసితులు అప్పులు చేసి బేస్‌మెంట్‌ వరకు నిర్మించినా పార్ట్‌ బిల్లులు విడుదల కాలేదు. ఇసుక దిబ్బలు తొలగించకపోవడంతో పంట సాగు లేక నిర్వాసితులు పట్టణాలకు వలసపోతున్నారు.
     2021 నవంబర్‌ 19 తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని అన్నమయ్య రిజర్వాయర్‌ తెగిపోవడంతో పులపత్తూరు, మందపల్లి, రామచంద్రాపురం, గుండ్లూరు, తోగూరుపేట, శేష మాంబపురం గ్రామాలను వరద ముంచెత్తిన విషయం విదితమే. 39 మంది చనిపోయారు. వందలాది ఇళ్లు కూలిపోయాయి. వేలాది పశుసంపద గల్లంతైంది. సర్వం కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ మేరకు 436 మందికి ఐదు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇంటి నిర్మాణానికి ఐదులక్షల చొప్పున కేటాయిస్తామని జారీ చేసిన జిఒ పైనాన్స్‌లో పెండింగ్‌ ఉంది. ఈ ఏడాది నవంబర్‌ 19 నాటికి ఏడాది పూర్తవుతున్నా ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగలేదు. 436 ఇళ్ల స్థలాల్లో 180 మంది రూ.150 లక్షల వరకు అప్పులు చేసి బేస్‌మెంట్‌ వరకు నిర్మించుకున్నారు. పార్ట్‌బిల్లు సైతం విడుదల చేయకపోవడంతో వడ్డీల చెల్లింపునకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
           నిర్వాసిత గ్రామాల్లోని సుమారు 1000 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. పలుమార్లు కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ మందపల్లి మినహా పుల పుత్తూరు తదితర గ్రామాల్లో జెసిబిలతో ఇసుకను కుప్పలుగా పోశారు. ఇసుక తరలింపును మరిచారు.
దీంతో సాగుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా కుటుంబ జీవనం దుర్భరంగా మారింది. 'అన్నమయ్య'ను సకాలంలో పునర్‌ నిర్మిస్తామని, పరివాహక ప్రాంతాల్లో ప్రొటెక్షన్‌వాల్‌ నిర్మిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఇందు కోసం ప్రతిపాదించిన రూ.787.77 కోట్లు కాగితాలకే పరిమితమయ్యాయి. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి బహుదా నదికి వరదలు పోటెత్తితే తమ సంగతేంటని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు.

                                                                       ఇసుక మేటలు తొలగించండి

పొలాల్లో ఇసుక మేటల కారణంగా పంటల సాగుకు అవకాశం లేదు. జీవనం కోసం చిల్లర దుకాణం పెట్టుకున్నాను తద్వారా వచ్చే అరకొర డబ్బుతో సంసారాన్ని నెట్టుకొస్తున్నాను.
                          - కె.ఉమామహేశ్వరరాజు,

                                                ఉపసర్పంచ్‌ పులపుత్తూరు. బేస్‌మెంట్‌లకు బిల్లులు ఇవ్వలేదు
బేస్‌మెంట్‌కు పార్ట్‌బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లులు అడిగితే 446 మంది బేస్‌మెంట్లు నిర్మించుకుంటేనే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అప్పు చేసి బేస్‌మెంట్లు వేశాం. అందరూ బేస్‌మెంట్‌ కట్టేవరకూ వడ్డీలు చెల్లించాలి.
                                                                                         - కుంభగిరి గంగయ్య,

                                                 పులపుత్తూరు. రూ.787.77 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం

అన్నమయ్య పునరుద్ధరణకు రూ.787.77 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాం. ఈ నెల రెండున పరిపాలనాపరమైన అనుమతి లభించింది. డిజైనింగ్‌, టెక్నికల్‌ అనుమతి లభించిన వెంటనే టెండర్లు పిలుస్తాం.
                                                                                           - కె.శ్రీనివాసులు,
                                                                              నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్‌,
                                                                                         అన్నమయ్య జిల్లా