May 10,2023 08:55

గోదావరి నది ఒడ్డున గ్రామాల ప్రజలు ఆ నీరే తాగుతారు. ఒకప్పుడు ఎంతో స్వచ్ఛంగా, తీయగా ఉండే నీరు రాను రాను ఆ రుచి ఉండటం లేదు. అంతేకాదు... కొన్ని ప్లాస్టిక్‌ పదార్థాలు, రసాయనాలు కలుస్తున్నట్లు నీటి పరీక్షలో తేలాయి. దాంతో 15 ఏళ్ల ఉమశ్రీ ఆ నది జలాలను శుభ్రం చేయాలనుకుంది. చదువుకుంటూనే ఓ వైపు రెండేళ్లుగా గోదారి నదీజలాల శుభ్రత కోసం కృషి చేస్త్తోంది.

        అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం, పొన్నమండ గ్రామానికి చెందిన ఉమాశ్రీ తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు విజరు కుమార్‌, సుగుణ దేవి అమెరికాలో నివసిస్తున్నారు. కూతురుకు అన్ని విధాలా సహకరిస్తుంటారు. వారి మద్దతుతో 'యూత్‌ ఎగైనెస్ట్‌ వాటర్‌ పొల్యూషన్‌' అనే సంస్థను రెండేళ్ల క్రితం స్థాపించారు. దీని ద్వారా ఆమె కోనసీమ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను స్థానిక అధికారులకు తెలియజేస్తుంది. నీటి కాలుష్యం వల్ల తలెత్తే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తుంది. నీరు కలుషితం చేయొద్దు అంటూ సూచనలు చేస్తుంది. ప్రజలను ఆ దిశగా చైతన్య పరుస్తూ కరపత్రాలు పంచుతోంది. దాంతో పాటు 100 రోజుల నుంచి నది తీరంలో ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లను, వ్యర్థాలను తొలగిస్తుంది. అంతేకాదు.. దేశంలో నీటి వనరులు కలుషితం అవుతున్నాయని, వాటిని తాగిన ప్రజలు రకరకాల రోగాల బారిన పడుతున్నారని గ్రహించి.. వాటి శుభ్రం చేయడమే తన భవిష్యత్తు లక్ష్యంగా పెట్టుకుంది.
       గోదావరి నది దగ్గర్లోనే ఉన్నా తన ఊరిలోకి తీవ్రమైన నీటి కొరత సమస్య ఉంది. దాంతో నీరు కొనుగోలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనిని నుంచి బయటపడేందుకు ఆమె ఈ కార్యాచరణకు పూనుకుంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పరిష్కారం చూపలేదు. చివరికి ఉమాశ్రీనే ఊరిలో అక్కడక్కడ నీటి గుంతలు తవ్వించింది. గోదావరి నదిపై 100కి పైగా క్లీనప్‌ డ్రైవ్‌లను నిర్వహించింది. సామాజిక, పర్యావరణ న్యాయం కోసం ఆమె చేస్తున్న ఈ కృషి- తోటి పిల్లలు, యువతలో బాధ్యతాయుత స్ఫూర్తిని నింపుతుంది. పర్యావరణ పట్ల తనకు ఉన్న అభిరుచితో భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ కావాలనుకుంటుంది. దాంతో వినూత్నమైన పద్ధతులతో, మురుగునీటిని సమర్థవంతంగా శుధ్ధి చేసే మిషనరీస్‌ తయారీకి పూనుకుంటానని చెబుతోంది.