గుడివాడ :ఓ బాలిక పొట్ట నుంచి కిలోకు పైగా జుట్టు తొలగించిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీరామా నర్సింగ్ హౌమ్లో జరిగింది. బాలిక(14) అన్నం తినడంలేదని, తరచూ వాంతులు చేసుకుంటూ క్రమంగా చిక్కిపోతోందని పట్టణానికి చెందిన ఆమె తల్లిదండ్రులు 15 రోజుల క్రితం నర్సింగ్ హౌమ్కు తీసుకొచ్చారు. వైద్యుడు పొట్లూరి వంశీకృష్ణ పలు పరీక్షలు చేసి ఆమెకు జుట్టు తినే అలవాటుందని గుర్తించి ఎండోస్కొపి తీయించారు. బాలిక కడుపులో కణితి మాదిరిగా జుట్టు పేరుకుపోయి కనిపించింది. దీంతో ఆమెకు మంగళవారం శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న కిలోకు పైగా బరువున్న జుత్తును తొలగించారు. రక్తహీనత వల్ల 20 ఏళ్లలోపు బాలికల్లో జుత్తు తినే అలవాటు ఉంటుందని డాక్టర్ పొట్లూరి వంశీకృష్ణ తెలిపారు.