ప్రజాశక్తి-ఉక్కునగరం, విశాఖ : 75 ఏళ్ల స్వతంత్ర ఫలాలను, దేశ సంపదను అదాని, అంబానీలకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు విమర్శించారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 895వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ విభాగ కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు, కోటేశ్వరరావు మాట్లాడారు. గడిచిన తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో కోట్లాది మందిని దారిద్య్ర రేఖకు దిగువకు నెట్టారని, ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గమనిస్తోందని అన్నారు. దేశ ప్రజల సొత్తు విశాఖ ఉక్కు అని, ఇది ఎవరి అబ్బ సొత్తు కాదని, ఈ పరిశ్రమను నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన వారంతా అధోగతి పాలయ్యారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ విభాగం కార్మికులు ఎస్.గోవిందరావు, జి.విశ్వేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, వి.రమణ, గంటా రామారావు, ఎస్.ఈశ్వరరావు, రంగయ్యనాయుడు, సంతోష్, పివి.రమణ, సలాది శ్రీను, రామన్న పాల్గొన్నారు.










