Oct 31,2023 22:24

ఆరో ఓటమితో సెమీస్‌ రేసునుంచి బంగ్లా నిష్క్రమణ
కోల్‌కతా: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ జట్టుకు ఊరట లభించింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్‌ జట్టు మంగళవారం బంగ్లాదేశ్‌పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టును పాకిస్తాన్‌ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో బంగ్లా జట్టు 45.1ఓవర్లలో 204పరుగులకు ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్‌ జట్టు 32.3ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 205పరుగులు చేసి గెలిచింది. ఛేదనలో భాగంగా పాక్‌ ఓపెనర్లు ఫకర్‌ జమాన్‌ (81; 74బంతుల్లో, 3ఫోర్లు, 7సిక్సర్లు), అబ్దుల్లా షఫీక్‌ (68; 69బంతుల్లో, 9ఫోర్లు, 2సిక్సర్లు) రాణించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 128పరుగులు జతచేశారు. ఆ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌(9) నిరాశపరిచినా.. రిజ్వాన్‌(26), ఇప్తికార్‌(17) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ 5వ స్థానానికి ఎగబాకింది. ప్రపంచకప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు ఇది మూడో గెలుపు.
అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ (45; 64 బంతుల్లో 6 ఫోర్లు), మహ్మదుల్లా (56; 79బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌), షకీబ్‌ అల్‌ హసన్‌ (43; 64 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. మెహది హసన్‌ మిరాజ్‌(25) పరుగులు చేశాడు. తాంజిద్‌ హసన్‌(0), నజ్ముల్‌ హొస్సేన్‌ శాంటో(4), ముష్పీకర్‌ రహీమ్‌(5), తౌహిద్‌(7), ముఫ్తికర్‌ రెహ్మాన్‌(3) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, మహ్మద్‌ వసీమ్‌కు మూడేసి, హారిస్‌ రవూఫ్‌కు రెండు, ఉసామా మీర్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఫకర్‌ జమాన్‌కు లభించింది.
షాహిద్‌ అఫ్రిది రికార్డు
పాక్‌ తరఫున వేగంగా 100వికెట్లు
ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ యువ పేసర్‌ షహీన్‌ షా అఫ్రిది ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌పై మూడు వికెట్లతో సత్తా చాటిన షాహిన్‌ అఫ్రిది పాకిస్తాన్‌ తరఫున వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. షాహిన్‌ కేవలం 50 ఇన్నింగ్స్‌లో 100 వికెట్లను తీసాడు. ఈ క్రమంలో స్లయిన్‌ ముస్తాక్‌(53 ఇన్నింగ్స్‌)లో 100 వికెట్లు రికార్డును బ్రేక్‌ చేశాడు. అలాగే టెస్టుల్లో 105 వికెట్లు, టి20ల్లో 64వికెట్లు తీసాడు. అలాగే వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌ తరఫున వేగంగా 32 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గానూ నిలిచాడు. ఈ రికార్డు ఇంతకుముందు రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయభ్‌ అక్తర్‌ (30 వికెట్లు) ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు.
స్కోర్‌బోర్డు..
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తంజిద్‌ హసన్‌ (ఎల్‌బి)షాహిన్‌ అఫ్రది 0, లింటన్‌ దాస్‌ (సి)అఘా సల్మాన్‌ (బి)ఇప్తికార్‌ అహ్మద్‌ 45, శాంటో (సి)ఉస్మా మీర్‌ (బి)షాహిన్‌ అఫ్రిది 4, ముస్తఫిజుర్‌ రహీమ్‌ (సి)రిజ్వాన్‌ (బి)హరీస్‌ రవూఫ్‌ 5, మహ్మదుల్లా (బి)షాహిన్‌ అఫ్రిది 56, షకీబ్‌ (సి)అఘా సల్మాన్‌ (బి)రవూఫ్‌ 43, తౌహిద్‌ హృదరు (సి)ఇప్తికార్‌ (బి)ఉస్మా మీర్‌ 7, మెహిదీ హసన్‌ (బి)మహ్మద్‌ వాసిం జూనియర్‌ 25, తస్కిన్‌ అహ్మద్‌ (బి)మహ్మద్‌ వాసిం జూనియర్‌ 6, ముస్తాఫిజుర్‌ (బి)మహ్మద్‌ వాసిం జూనియర్‌ 3, షోరిఫుల్‌ ఇస్లామ్‌ (నాటౌట్‌) 1, అదనం 9. (45.1ఓవర్లలో ఆలౌట్‌) 204పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/6, 3/23, 4/102, 5/130, 6/140, 7/185, 8/200, 9/201, 10/204
బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 9-1-23-3, ఇప్తికార్‌ అహ్మద్‌ 10-0-44-1, హరీస్‌ రవూఫ్‌ 8-0-36-2, మహ్మద్‌ వాసిం జూనియర్‌ 8.1-1-31-3, ఉస్మా మీర్‌ 10-0-66-1.
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: అబ్దుల్లా షఫీక్‌ (ఎల్‌బి)మెహిదీ హసన్‌ 68, ఫకర్‌ జమాన్‌ (సి)తౌహిద్‌ హిండోరు (బి)మెహిదీ హసన్‌ 81, బాబర్‌ అజమ్‌ (సి)మహ్మదుల్లా (బి)మెహిదీ హసన్‌ మిరాజ్‌ 9, రిజ్వాన్‌ (నాటౌట్‌) 26, ఇప్తికార్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 17, అదనం 4. (32.3ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 205పరుగులు.
వికెట్ల పతనం: 1/128, 2/160, 3/169
బౌలింగ్‌: తస్కిన్‌ అహ్మద్‌ 6-1-30-0, షోరిఫుల్‌ ఇస్లామ్‌ 4-1-25-0, మెహిదీ హసన్‌ 9-0-60-3, ముస్తాఫిజుర్‌ 7-0-47-0, షకీబ్‌-అల్‌-హసన్‌ 5.3-0-30-0, నజ్ముల్‌ 1-0-5-0
వన్డే ప్రపంచకప్‌లో నేడు..
న్యూజిలాండ్‌ × దక్షిణాఫ్రికా
(వేదిక: పూణే, మ.2.00గం||లకు)