- తోషఖానా కేసులో శిక్ష రద్దు
ఇస్లామాబాద్ : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. తోషఖానా అవినీతి కేసులో ఇమ్రాన్‌కు దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను రద్దు చేస్తూ, ఆయనను బెయిలుపై విడుదల చేయాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. 2018-2022 మధ్య కాలంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు లభించిన ప్రభుత్వ బహుమతులను దాచి పెట్టి, అమ్ముకున్నారన్న ఆరోపణపై దిగువ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి, మూడేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఇమ్రాన్ పదే పదే తిరస్కరిస్తున్నందున శిక్షను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఖాన్‌ఈ కేసులో బెయిలుపై బయట పడినా, డజన్ల కొద్దీ ఇతర ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే మళ్లీ అరెస్టు కాకుండా బ్లాంకెట్ బెయిలు కోసం ఖాన్ బృందం ఒక పిటిషన్ వేసింది. ఇమ్రాన్‌పై శిక్ష మాత్రమే రద్దయింది, అసలు నేరారోపణ కాదు, కాబట్టి అయిదేళ్లపాటు ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనకుండా ఆయనపై ఉన్న నిషేధం అలాగే ఉంటుందని న్యాయవాది మీర్జీ మోయిజ్ బేగ్ అన్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పును పిటిఐ స్వాగతించగా, మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షను ప్రస్తుతానికి రద్దు మాత్రమే చేశారని, పూర్తిగా కొట్టివేయలేదని వ్యాఖ్యానించారు.










