ముంబయి : రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ గురువారం 52 వారాల కనిష్ట స్థాయి వద్ద ట్రేడింగ్ అయ్యింది. ఉదయం రూ.2,243 వద్ద ప్రారంభమైన సూచీ.. ఓ దశలో రూ.2,202కు పడిపోయి ఏడాది కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. మరో దశలో రూ.2,254 గరిష్ట స్థాయికి చేరి.. తుదకు 0.34 శాతం నష్టంతో రూ.2,229 వద్ద ముగిసింది. గడిచిన ఐదు సెషన్లలో ఈ సూచీ 4.31 శాతం లేదా రూ.100 నష్టపోయింది. గురువారం సెషన్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్ ఇంట్రాడేలో 57,887-57,158 కదలాడి.. తుదకు 79 పాయింట్ల లాభంతో 57,634కు చేరింది. దీంతో వరుసగా ఐదు రోజులుగా నష్టల్లో కొనసాగిన మార్కెట్లకు స్వల్ప ఉపశమనం లభించినట్లయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 16,985 వద్ద ముగిసింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.










