Jun 26,2023 11:45
  • మహిళలు చుట్టుముట్టడంతో విడిచిపెట్టిన సైన్యం
  • హోం మంత్రితో సిఎం భేటీ
  • 30 వరకూ ఇంటర్నెట్‌ నిలిపివేత

ఇంఫాల్‌ : మణిపూర్‌లోని ఇతం గ్రామంలో 1,200 మందికి పైగా మహిళలు చుట్టుముట్టడంతో సైన్యం ఆదివారం 12 మంది మిలిటెంట్లను విడుదల చేసింది. ఇంఫాల్‌ ఈస్ట్‌లోని ఇథమ్‌లో మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంతో సైనికులు గ్రామాన్ని చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మహిళల ఆధ్వర్యాన సుమారు 1200 నుంచి 1500 మంది ఆర్మీ వాహనాలను చుట్టుముట్టి, వాహనాలు ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు. కొన్ని గంటలపాటు ఉద్రిక్తత కొనసాగడంతో 12 మంది మిలిటెంట్లను వదిలేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో, ఆందోళన విరమించారు. అనంతరం గ్రామంలో పెద్దసంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో మొయితీ వర్గానికి చెందిన మొయిరంగథెం తంబాసహా మిలిటెంట్‌ గ్రూప్‌ కంగ్లీ యావోల్‌ కన్నా లుప్‌ సభ్యులు తప్పించుకున్నారు. మణిపూర్‌ సిఎం ఎన్‌.బీరేన్‌సింగ్‌ ఆదివారం హోం మంత్రి అమిత్‌షాను ఆదివారం కలిశారు. ఈ విషయాన్ని బీరేన్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. 'అమిత్‌షా పర్యవేక్షణలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గత వారంలో చాలావరకూ హింసను నియంత్రించగలిగాయి. ఈ నెల 13 నుంచి హింసాత్మక ఘటనల వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు' అని సిఎం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలావుండగా, రాష్ట్రంలో ఇంటర్నెట్‌పై నిషేధం ఈ నెల 30 వరకూ కొనసాగుతుందని మణిపూర్‌ ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.