విజయవాడ : 1998 డిఎస్‌సి సర్టిఫికెట్లు పరిశీలన చేసినవారందరికీ ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని కోరుతూ ... మే 10, 11, 12 తేదీల్లో జరగనున్న రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు.
మంగళవారం విజయవాడలోని ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం వద్ద అండ్రమాల్యాద్రి విలేకరులతో మాట్లాడుతూ .... 1998 డిఎస్సీ పోస్టులు నియామకాల్లో దళిత, గిరిజన, వెనుకబడిన బలహీనవర్గాలు, వికలాంగులు, మహిళలకు రాజ్యాంగబద్దంగా రావలసిన రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆధిపత్య అగ్రకులాలకు ఇచ్చిన వైఎస్ జగనన్న దుర్మార్గమైన కులదురంకార చర్యను కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. దీనిపై మహిళా, బిసి, ఎస్‌సి కోటాలో మంత్రి పదవులు తీసుకున్న హౌం, డిప్యూటీ సిఎం, విద్యా , సాంఘిక సంక్షేమశాఖ మంత్రులుగా ఉన్న తానేటి వనిత, బత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున ఏమీ మాట్లాడకపోవడం, స్పందించకపోవడం శోచనీయమన్నారు. వారంతా ఇప్పటికైనా స్పందించాలని కోరారు. లేదంటే ... 2024 ఎన్నికలలో దళిత , గిరిజన, వెనుకబడిన బలహీన వర్గాలు , వికలాంగులు , మహిళలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 1998 డిఎస్సీ సర్టిఫికెట్లు పరిశీలన చేసింది... 6780 అని, పాదయాత్ర లో జగనన్న హామీ ఇచ్చింది .... 5887 అని చెప్పారు. జాబ్ క్యాలండర్ లో ప్రకటించింది ... 5887 అయితే క్యాబినెట్ లో ప్రకటించింది .... 5887 అన్నారు. వీటిలో జగనన్న ఇచ్చిన పోస్టులు ... 4072 అని ఈ పోస్టులన్నీ ఆధిపత్య అగ్రకులాలకే ఇచ్చారని వివరించారు. వెనుకబడిన కులాలవారు ఈ విషయమై అడిగితే ... అసలు ఫైలే లేదని , రూల్ అఫ్ రిజర్వేషన్లు అమలు చేయొద్దంటూ.. అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో చాలామంది అభ్యర్థులు క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, సలహాదారుల వరకు.. అధికార, అనధికార నాయకులను కూడా కలిశారని తమ బాధను విన్నవించుకున్నారని అయినప్పటికీ అధికారులు, మంత్రుల నుండి ఎలాంటి కదలిక రాలేదని మండిపడ్డారు. మే 10, 11, 12 తేదీలలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నామని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని దీక్షలను జయప్రదం చేయాలని అండ్రమాల్యాద్రి పిలుపునిచ్చారు.