- పనులు లేక వలసలు
- పుట్టకొకరు.. చెట్టుకొకరుగా 'అన్నమయ్య' నిర్వాసితులు
- ఏడాదిన్నర కావస్తున్నా అమలుకు నోచని సిఎం హామీ
ప్రజాశక్తి - కడప ప్రతినిధి : ఇల్లు వదిలారు. పొలాలు మరిచిపోయారు. ఊరి మీద మమకారం చంపుకోలేక దాతలు కట్టించిన రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నారు. ఉన్నచోట ఉపాధిలేకపోవడంతో భార్య, పిల్లలను పోషించుకునేందుకు పొట్టచేతపట్టుకుని కొందరు వలసబాటపట్టారు. అన్నమయ్య రిజర్వాయర్ కట్టతెగిపోవడంతో సమీప గ్రామస్తులు ఊరికొకరు...పుట్టకొకరుగా వెళ్లిపోయారు. నిర్వాసితులను ఆదుకుంటాం...పక్కా ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం హామీనిచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా వారి కష్టాలు తీరడం లేదు.
2021 నవంబర్ 19న రిజర్వాయర్ కట్ట తెగడంతో అన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని పులపత్తూరు, మందపల్లి, రామచంద్రాపురం, గుండ్లూరు, తోగూరుపేట, శేషమాంబపురం గ్రామాలు వరద విలయంలో చిక్కుకుని సంగతి తెలిసిందే.
39 మంది చనిపోయారు. వందలాది ఇళ్లునేలమట్టం అయ్యాయి. వేలాది పశుసంపద గల్లంతు అయ్యాయి. 2021 డిసెంబర్‌లో నిర్వాసిత గ్రామాల్లో సిఎం జగన్ పర్యటించారు.
ఐదు సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆ సందర్భంగా హామీఇచ్చారు. ఏడాదిన్నర కావస్తున్నా ఇళ్ల నిర్మాణ పనులు పునాదులకే పరిమితమయ్యాయి. 436 ఇళ్లలో ఒక్క ఇళ్లూ ప్రారంభోత్సవానికి నోచలేదు. సుమారు 256 ఇళ్ల నిర్మాణ పనులను తిరుపతికి చెందిన ఓ కాంట్రాక్టర్ చేపట్టారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో రెండు నెలల నుంచి పనులను నిలిపివేశారు. తమ ఇళ్లను కాంట్రాక్టర్ పరిధి నుంచి తప్పిస్తే అప్పు చేసైనా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటామని నిర్వాసితులు కోరుతున్నారు.
అన్నమయ్య నిర్వాసిత గ్రామాల్లోని 855 నుంచి 1000 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. పలుమార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా మందపల్లి మినహా పులపుత్తూరు తదితర గ్రామాల్లో 50 శాతం మేర ఇసుకను కుప్పలుగా వేేశారు. మిగిలిన 50 శాతం పొలాలను విస్మరించారు. పంటల సాగుకు నోచక, ఉపాధి పనులు లభించక నిర్వాసితులు పట్టణాలను వలస వెళ్తున్నారు.
రిజర్వాయర్ నిర్మాణం కోసం జిల్లా నీటిపారుదల శాఖ రూ.787.77 కోట్లతో టెండర్లు పిలిచినా నిర్మాణ పనులు ఊపందుకోలేదు. సుమారు 16 కిలోమీటర్ల మేర చెయ్యేరులోని నిర్వాసిత గ్రామాలకు సంబంధించిన ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలను పంపగా..రిమార్క్ పేరిట ప్రభుత్వం తిప్పి పంపించడంతో జిల్లా నీటిపారుదల శాఖ తంటాలు పడుతోంది.

వరద రోజుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వచ్చిందని మందపల్లి గ్రామానికి చెందిన సత్రపు సుబ్బమ్మ ఆనాటి సంఘటనను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మరోసారి ఇలా జరగకుండా రక్షణగోడ నిర్మించాలని ఆమె ప్రభుత్వాని వేడుకుంటున్నారు.

పొలాల్లో ఇసుక మేటలను తొలగిస్తే పంటలు సాగు చేసుకుంటామని మందపల్లి గ్రామానికి చెందిన నరసింహులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
హౌసింగ్ పనులను పునరుద్ధరిస్తాం : మురళీకృష్ణ, హౌసింగ్ డిఇ, అన్నమయ్య జిల్లా
అన్నమయ్య నిర్వాసితుల హౌసింగ్ పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం. నిర్వాసిత గ్రామాల్లోని 436 ఇళ్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులు చేయడానికి ప్రయత్నిస్తాం.










