
ముంబయి : ఆస్ట్రేలియాతో 17న జరిగే తొలి వన్డేకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు అందుబాటులో ఉండలేనని రోహిత్ శర్మ బోర్డుకు తెలపడంతో హార్దిక్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వన్డే జట్టులో విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలతో కూడిన భారతజట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. ఇక శ్రేయస్ అయ్యర్ గాయపడడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం. వాంఖడే స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌కు దిగే జట్టు క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు చెమటోడ్చాల్సి ఉంటుంది. ఈ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్టు తలపడడం ఇది ఐదోసారి. అందులో మూడుసార్లు ఆసీస్, రెండుసార్లు భారత్ గెలిచాయి. ఈ వేదికపై 2020 జనవరిలో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 10వికెట్ల తేడాతో భారతజట్టుపై ఘన విజయం సాధించింది. భారత్ తొలిగా బ్యాటింగ్‌కు దిగి 255పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 258పరుగులు చేసి గెలిచింది.