
జగనన్న భూహక్కు, రక్షపై సమీక్షలో సిఎం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇంటినుంచే పూర్తిచేసేవిధంగా నూతన సాంకేతికతను తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. జగనన్న భూహక్కు, భూరక్ష కార్యక్రమపై గురువారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని గ్రామ సచివాయాల్లో ఈ కార్యక్రమం అమలు జరుగుతోందని చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థను నేరుగా గ్రామాల్లోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలోనూ సర్వేయరు ఉండే విధంగా దీనిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. భూయజమానులకు హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వం మెరుగుదలకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అలాగే ప్రభుత్వం ఏమి చేసినా తప్పుడు ప్రచారం చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని అన్నారు ఫేజ్‌ా2 సర్వే పూర్తయిన గ్రామాల్లో అన్ని రకాల రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మొదటిదశ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లపై సమీక్ష చేయాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. భూ వివాదాలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో భూ వివాదాల మొబైల్ కోర్టులు కూడా నడిచేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
95 శాతం గ్రామాల్లో డ్రోన్‌సర్వే పూర్తి
రాష్ట్రంలో 13,460 గ్రామాలకుగాను 12,836 గ్రామాల్లో అంటే 95 శాతం డ్రోన్ సర్వే పూర్తయిందని అధికారులు ఈ సందర్భంగా సిఎం దృష్టికి తీసుకువచ్చారు. మిగిలిన పనిని అక్టోబరు 15లోగా పూర్తి చేస్తామని చెప్పారు. 81 శాతం గ్రామాల్లో సర్వే ఇమేజ్ ప్రక్రియ పూర్తయిందని, 60 శాతం గ్రామాల్లో ఓఆర్‌ఐలను జిల్లాలకు పంపించాలన్నారు. 3,240 రోవర్లు సర్వేలో ఉన్నాయని, గతంతో పోల్చుకుంటే 1,620 అదనంగా తెప్పించామని వివరించారు. ఫేజ్‌ా2లో భాగంగా రెండువేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీకి సన్నాహాలు చేశామన్నారు. అక్టోబరు 15 నాటికి రెండో దఫా సర్వే చేపడుతున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే మున్సిపల్ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని కూడా సిఎంకు వివరించారు. 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్ పూర్తయిందని తెలిపారు. 66 మున్సిపాలిటీల్లో ఓఆర్‌ఐ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలని సిఎం ఆదేశించారు.