
-రాష్ట్రాన్ని అదానీకి దోచిపెడుతున్నారు
-'ప్రజారక్షణ భేరి' యాత్రలో గఫూర్
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో, నెల్లూరు ప్రతినిధి:రాష్ట్రంలో భూకబ్జాల పాలన సాగుతోందని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అవకాశవాద అబద్దాల ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ విమర్శించారు. రాష్ట్రాన్ని అదానీకి దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. సిపిఎం నిర్వహిస్తోన్న ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర ఆదివారం తిరుపతి జిల్లా రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా సర్వేపల్లి మీదుగా ముత్తుకూరు వరకూ సాగింది. యాత్ర బృందానికి అడుగడుగునా వివిధ తరగతుల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో గఫూర్ మాట్లాడుతూ విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చని అవకాశవాద, అరాచక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు సాగిలపడుతున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్నాయని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ, ప్రయివేటు భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా, వారిని అక్కడి నుంచి బలవంతంగా వెళ్లగొడుతోందని అన్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అధికార పార్టీ కంటే ముందు పోలీసులే ఓవర్ యాక్షన్ చేస్తూ వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చిన్నచిన్న తాయిలాలు ఇస్తూ కార్పొరేట్ శక్తులకు వేలాది కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని విమర్శించారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీ పరం చేశారని గుర్తు చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదన్నారు. రాయలసీమ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తోన్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. మోడీకి సాగిలబడితే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడదని, తిరగబడి ఉద్యమిస్తేనే హక్కులను కాపాడుకోగలమని తెలిపారు. జగన్ ఫ్రభుత్వం పూర్తిగా ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పన్ను రాయితీ వెసులుబాటు కలిగి కొత్తగా పరిశ్రమలు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చేవన్నారు. పరిశ్రమలు రాక, ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక ఎంఎ, బిఇడి చేసిన యువత చివరకు ఆటోలు నడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనికి కారణం కేంద్రం కాదా? అంటూ ప్రశ్నించారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడకపోతే మరింత ప్రమాదంలో పడతారన్నారు. ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో ఈ యాత్రను సిపిఎం చేపట్టలేదని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రజలను చైతన్యపరచడానికి ఈ యాత్ర సాగిస్తోందని తెలిపారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఈ యాత్రలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు, ఎం.భాస్కరయ్య, దయా రమాదేవి, తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.