Oct 25,2023 20:47

ముంబయి : అధిక ధరలు ప్రజల కొనుగోలు శక్తిని తగ్గిస్తున్నాయి. సాధారణంగా పండుగ సీజన్‌లో కొనుగోళ్లు పుంజుకోవడంతో పాటుగా క్రెడిట్‌ కార్డుల చెల్లింపులు పెరుగుతాయి. కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4.2 శాతం తగ్గి రూ.1.42 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఇంతక్రితం నెల ఆగస్ట్‌లో రూ.1.48 లక్షల కోట్ల వ్యయాలు జరిగాయి. ఆర్‌బిఐ గణంకాల ప్రకారం.. ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల వాడకం 10.9 శాతం వృద్థి చోటు చేసుకుంది. మిగితా అన్ని ప్రధాన బ్యాంక్‌లు జారీ చేసే క్రెడిట్‌ కార్డ్‌ల వ్యయం తగ్గింది. ఎస్‌బిఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల వ్యయాలు వరుసగా 8.9 శాతం, 8.4 శాతం, 4.9 శాతం,1.8 శాతం చొప్పున నెలవారీ క్షీణతను చవి చూశాయి. ఆగస్ట్‌, సెప్టెంబర్‌ మాసాల్లో క్రెడిట్‌ కార్డు లావాదేవీల సంఖ్య కూడా 7 శాతం పతనమై 49,440కి పడిపోయాయి. క్రితం సెెప్టెంబర్‌లో ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌లలో, క్రెడిట్‌ కార్డ్‌ల ఖర్చు 3 శాతం తగ్గి రూ.92,879 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఏడాది నవంబర్‌లో దీపావళి పండుగ వస్తోన్న నేపథ్యంలో అక్టోబర్‌లో అధిక క్రెడిట్‌ కార్డ్‌ వ్యయాలు చోటు చేసుకోవచ్చని ఫిన్‌టెక్‌ సంస్థ కివీ సహ వ్యవస్థాపకుడు మోహిత్‌ బేడి పేర్కొన్నారు. దేశంలో నిరంతరం పెరుగుతోన్న ద్రవ్యోల్బణం వినియోగంపై ఆందోళన పెంచుతోంది. అధిక ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రజలు విచక్షణతో కూడిన వ్యయాలు చేస్తున్నారని ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ పాత్ర ఇటీవల పేర్కొన్నారు. ఇది అమ్మకాల వృద్థిని మందగించేలా చేస్తోందన్నారు.