న్యూఢిల్లీ : ఎన్‌డిటివిని అడ్డదారిలో స్వాధీనం చేసుకున్న గౌతం అదాని ఆ సంస్థ నిర్వహణలో మెరుగైన ఫలితాలను రాబట్టలేకపోతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 51 శాతం పతనంతో కేవలం రూ.6 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.12 కోట్ల లాభాలు సాధించింది. సంస్థకు వచ్చే ప్రకటనలు పడిపోవడానికి తోడు అధికంగా వడ్డీ చెల్లింపులు సంస్థ లాభాలకు గండి కొట్టాయని తెలుస్తోంది. క్రితం క్యూ2లో సంస్థ రెవెన్యూ 10 శాతం క్షీణించి రూ.95 కోట్లుగా చోటు చేసుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.106 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో ఎన్‌డిటివి మొత్తం వ్యయం రూ.93.48 కోట్లుగా నమోదయ్యిందని ఆ సంస్థ రెగ్యూలేటరీ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. 2022 ఇదే త్రైమాసికంలో రూ.91.93 కోట్ల వ్యయం చోటు చేసుకుంది. క్రితం క్యూ2లో ఆ సంస్థ ఎన్‌డిటివి మధ్య ప్రదేశ్, ఎన్‌డిటివి రాజస్థాన్ ఛానళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది. వృద్థిలో భాగంగా విస్తరణపై దృష్టి పెట్టినట్లు తెలిపింది.