ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆటో స్టాండ్‌లో అధికారులు ఎర్రమట్టి వేయడం కారణంగా ఆటో కార్మికులకు ఆటో స్టాండ్‌లో ఆటోలు నింపుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఉందని వెంటనే అధికారులు ఎర్రమట్టిని తొలగించాలని సిపిఎం జమ్మలమడుగు కార్యదర్శి వీరనాల శివ నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆటో స్టాండ్ పరిశీలించి తహశీల్దార్ గుర్రప్పకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివ నారాయణ మాట్లాడుతూ ఆటో కార్మికులు సంవత్సరాల తరబడి ఎంతో కాలంగా ఆటో నడుపుకుంటూ ఆ స్థలంలో ఆటో నిలుపుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. గత కొద్దిరోజుల క్రితం ఆటో స్టాండ్‌లో అధికారులు ఎర్ర మట్టి వేయడం కారణంగా ఆటోలు నిలుపుకోవడానికి స్థలం లేక రోడ్డుపై నిలుపుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిత్యం ప్రజల సౌకర్యాల కోసం గ్రామాలకు చేరవేసే క్రమంలో వారధిగా ప్రజలకు ఆటో కార్మికులు ఉన్నారన్నారు. మధ్య తరగతి వర్గాలకు చెందిన ఆటో కార్మికుల పైన ఇలాంటి చర్యలు చేపట్టడం చేత వాళ్ల జీవనోపాధికి దెబ్బ తగిలినట్లు అవుతుందన్నారు. ఆటో స్టాండ్‌లో ఆటోలు నిర్వహించుకోలేని కారణంగా ఆటోలు రోడ్డుపై నిలుపుకోవడం చేత అటు పోలీసులు ఇటు అధికారులు చేత ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఎర్రమట్టి కుప్పలు తొలగించి ఆటో స్టాండ్‌కు ఏర్పాటు చేయాలని ఆటో కార్మికులకు న్యాయం చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు దాసు, ఆటో వర్కర్స్ యూనియన్ పట్టణ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, నరేంద్ర, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










