Aug 31,2023 06:27

అమ్మానాన్న ఇద్దరూ వైకల్యంతో బాధపడుతుంటే.. అదీ చెవి, మూగ బాధితులైతే.. వారి పిల్లల పరిస్థితి ఏంటి? అమ్మతో చెప్పుకుందామనుకున్న ఊసులు, నాన్నతో పంచుకోవాల్సిన ఆశ్చర్యాలు ఎలా చెప్పుకోవాలి? ఈ బాధతో చాలామంది వైకల్య బాధిత తల్లిదండ్రులున్న పిల్లలు మానసిక వేదన పడుతుంటారు. కానీ, నీతా గోపాలకృష్ణ అలా కాదు.. వైకల్య బాధిత తల్లిదండ్రులతో మాట్లాడుతూ సైన్‌ లాంగ్వేజ్‌ వంట బట్టించుకుంది. ఇప్పుడు అదే భాషను నేర్పుతూ వేలాదిమంది వైకల్య బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
'నా తల్లిదండ్రులను నేను ఎప్పుడూ ప్రత్యేక వ్యక్తులుగా చూడలేదు. నా దృష్టిలో వారికి ఉన్న లోపం పెద్ద విషయమే కాదు' అంటున్న నీతా ఆలోచనలతో ఏకీభవిస్తూ తన భర్త చైతన్య కొత్తపల్లి 'యునికీ' సంస్థలో భాగమయ్యారు. సహోద్యోగి రాహుల్‌ జైన్‌ కూడా వారితో కలిసి ప్రయాణిస్తున్నారు. భిన్న రంగాల నుండి వచ్చినా ఏకైక లక్ష్యంగా నడుస్తోంది ఆ మిత్రబృందం.
చిన్నప్పటి నుండి అమ్మానాన్నతో సైగలతో మాట్లాడిన నీతా తన మాతృభాష సైగల భాషే అంటారు. అమ్మానాన్నల దృష్టి కోణం నుండి ప్రపంచాన్ని చూసిన నీతాకి వైకల్యంతో బాధపడేవారికి అండగా నిలబడాలని బాల్యంలోనే బలంగా నాటుకుపోయింది. ఉన్నత చదువులు చదువుకుని, సైన్‌ లాంగ్వేజ్‌ర్‌గా ప్రయాణం మొదలుపెట్టారు. మొదటగా చెవిటి, మూగ బాధిత స్కూలు పిల్లలకు సైన్‌ లాంగ్వేజ్‌ నేర్పించేవారు. 'వైకల్య బాధితులకు సమాజం నుండి వివక్ష ఎదురుకాకుండా ఉండాలంటే వారికి తమ శక్తిసామర్థ్యాలపై నమ్మకం కలగాలి. ఆ దిశగానే నేను ప్రయత్నించాను. కోవిడ్‌ సమయంలో మాకు చాలా విరామం దొరికింది. ఆ సందర్భంలో వైకల్య బాధిత పిల్లల ప్రాథమిక విద్య పట్ల ఆందోళన చెందాం. ఆ తరువాత కొనసాగిన ఆలోచనల్లోంచే 'యునికీ' ఆవిర్భవించింది.' అని వివరించారు నీతా.

2


'సమాజంలో అందరిలాగానే వినికిడి సమస్య ఉన్న వాళ్లు కూడా సమాన అవకాశాలు పొందాలి. వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు కల్పించాలి. దాని కోసం శిక్షణ కావాలి. ఇదే 'యునికీ' రూపకల్పన ప్రధాన లక్ష్యం. '2020లో 'యునికీ'ని ప్రారంభించాం. చెవిటి వ్యక్తులతో మాట్లాడితేనే వారి గురించి మనకు తెలుస్తుంది. కానీ మనం మాట్లాడే భాష వారికి తెలియదు. అందుకే చాలామంది వైకల్య బాధితులు ఆత్మనూన్యతతో బాధపడుతుంటారు. వాళ్లను గుర్తించేలా చేద్దామని సంస్థకు 'యునికీ' అని పేరు పెట్టాం. తెలుగులో దీనర్థం.. 'నన్ను గుర్తించు.. విస్మరించవద్దు' అని సంస్థ లక్ష్యం గురించి చైతన్య వివరించారు.
ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50 వేల మంది నైపుణ్య శిక్షణ పొందారు. 10 వేల మంది పెద్ద వయసు వారికి సైగల భాష నేర్పించారు. వర్క్‌షాపులు, క్యాంపెయిన్‌లతో పాటు సోషల్‌మీడియా ద్వారా 'సైన్‌ మీడియం' గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. స్టాక్‌ ట్రేడింగ్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, ఐఇఎల్‌టిఎస్‌ వంటి 120 విభిన్న శిక్షణ తరగతులను 'యునికీ' ద్వారా నిర్వహిస్తున్నారు.
'సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకోకముందు నేను ఎవరితోనూ మాట్లాడేవాడిని కాను. కానీ ఇక్కడ శిక్షణ పొందాక నా కుటుంబంతో చాలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను. ఇక్కడ నేర్చుకున్న కోర్సు ద్వారా వెబ్‌ డెవలప్‌మెంట్‌ సెక్టార్‌లో ఉద్యోగం సంపాదించాను.' అని చెప్పాడు ఈ వర్క్‌షాప్‌లో భాగమైన దిబేందు.