చెరువు మీద ఆకాశంలో నక్షత్రాలు వెలిసారు
మేఘాలు కమ్ముకున్న దట్టమైన రుతువులో
ముఖం మనిషికి చాటేసింది
బహిర్భూమిగా మిగిలిన జనారణ్యంలో
నిస్సహాయంగా ఒలికిన కన్నీరుకు
నీటి జీవాల మనసు నొచ్చుకుంది
దెయ్యాలతో రమించిన దోమల
గుడ్లు పిగులుతున్నారు
అందరూ దద్దుర్లను గోక్కుంటూనే
హంతకుల తల నిమురుతున్నారు
వలలో పడిన నక్షత్రాలను చూసి
'దొంగ.. దొంగ..' అని అరిచిన కావలివారు
కటకటాల మధ్య కాలాతీతులయ్యారు
రేపెప్పుడో పసుపూ కుంకుమా పంచుతారు
తుప్పట్టిన సుత్తులూ కొడవళ్లు పట్టుకుని
సైకిలెక్కి గిరగిరా కేంద్రానికొచ్చేయండి
మీక్కావల్సింది ఉత్తి పుణ్యానికొచ్చే పీఠమేగా?
తెల్లారడానికి ముందటి చీకట్లో
ఇటీవలి బాధితుడొకడు బుడుంగున దూకేశాడు
చెరువుపైని ఆకాశంలో నక్షత్రాలన్నీ విలవిలలాడాయి
అటీవల చిందిన నెత్తురంతా,
ఇటీవల తెల్లారబోయే ఉదయం కోసం
గొంతుక్కూచుంది!
- దేశరాజు