ప్రజాశక్తి - పిఎం.పాలెం (విశాఖపట్నం) : విశాఖ పిఎం పాలెం సమీపంలోని ఎసిఎ - విడిసిఎ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్) సీజన్ - 2లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో బెజవాడ టైగర్స్‌పై రాయలసీమ కింగ్స్ విజయఢంకా మోగించింది. తొలుత టాస్ గెలిచిన రాయలసీమ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బెజవాడ టైగర్స్ బ్యాట్స్‌మెన్‌లు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేశారు. ఓపెనర్‌గా సమిష్టిగా రాణించి 79 బంతుల్లో 103 పరుగులు చేసి స్కోరును ముందుకు పరుగులు పెట్టించారు. వారు అవుట్ అయ్యాక మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు రాణించకపోవడంతో ఆ జట్టు 152 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌లు 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెఎం.వీరారెడ్డి 39 బంతుల్లో 4 సిక్స్‌లు, 5 ఫోర్లుతో 61 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు రాణించి 30 బంతుల్లో 44 పరుగులు చేయడంతో ఆ జట్టు విజయాన్ని అందుకుంది.










