రావి శాస్త్రిగా ప్రఖ్యాతి చెందిన రాచకొండ విశ్వనాధ శాస్త్రి గొప్ప కథా, నవలా రచయిత మాత్రమే కాదు; గొప్ప నాటక రచయిత కూడా! సమాజంలోని చెడును చీల్చి చెండాడుతూ, మహిళా అభ్యుదయాన్ని కాంక్షిస్తూ 1956లో ఆయన 'తిరస్కృతి' అనే నాటిక రాశారు. ఇది 'వచ్చే కాలం' పేరుతో 1957లో 'భారతి' మాస పత్రికలో వెలువడింది. 1964లో 'తిరస్కృతి' పేరుతో పుస్తకంగా వచ్చింది.
'తిరస్కృతి' నాలుగు అంకాల నాటిక. ఇందులో కామేశ్వరికి జరిగిన మోసాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రాశారు. స్త్రీలు సొంతంగా ఆలోచించి తమ నిర్ణయాలు తామే తీసుకొని జీవితాలు బాగు చేసుకోవాలని సందేశం ఇచ్చారు. గురజాడ కూడా ఇదే అభిప్రాయాన్ని 'కన్యాశుల్కం'లో వెలుబుచ్చారు. గురజాడ వారసుడు రావిశాస్త్రి. పెట్టుబడిదారీ వ్యాపార విష సంస్కృతి క్రమక్రమంగా సమాజంలో పెరిగిపోయింది. దీనివల్ల బడా ధనవంతులకు శ్రమ విలువ తెలియకుండా పోయింది. మానవ సంబంధాలను కూడా డబ్బుతో ముడిపెట్టారు. ఇలాంటి నీచమైన సంప్రదాయం మంచిది కాదని, సమాజాన్ని జాగృతి చేయడం కోసమే రావిశాస్త్రి ఈ నాటిక రాశారు.
ఇతివృత్తం : బడా పారిశ్రామికవేత్త రమణయ్య దగ్గర సెక్రటరీగా చంద్రశేఖర్, గుమస్తాగా కుటుంబయ్య పని చేస్తారు. కుటుంబయ్య, కొడుకు చనిపోతాడు. దు:ఖంలో వున్న అతన్ని పరామర్శించడానికి చంద్రశేఖర్, కుటుంబయ్య స్నేహితుడు, ఉపాధ్యాయుడైన సోమనాథం వస్తారు. ధైర్యంగా వుండమని ఇద్దరూ ఓదార్చుతారు.
సోమనాథం తన కూతురు పెళ్ళికి, రమణయ్య దగ్గర రూ.500లు అప్పు ఇప్పించమని చంద్రశేఖరును అడుగుతాడు. అతడు సోమనాథాన్ని రమణయ్యకు పరిచయం చేస్తాడు. అయితే, రమణయ్య అప్పు ఇవ్వకపోగా, సోమనాధాన్ని అవమానిస్తాడు. ఆత్మాభిమానం గల సోమనాథం అదే స్థాయిలో జవాబిస్తాడు. రమణయ్య రెండో కొడుకు మోహన్‌బాబు. అదే సమయంలో కుటుంబయ్య కూతురు కామేశ్వరి వచ్చి మోహన్‌బాబు వల్ల తాను గర్భవతి అయ్యానని చెబుతుంది. తమ యిద్దరికి పెళ్ళి చేయమని వేడుకుంటుంది. మోహన్‌బాబు తనకు కామేశ్వరి ఎవరో తెలియదని బుకాయిస్తాడు. తనకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని కామేశ్వరి ఆవేదన చెందుతుంది. చంద్రశేఖర్ జోక్యం చేసుకొని, మోహన్‌బాబుని పెళ్ళికి ఒప్పిస్తానని, ఏ అఘాయిత్యం చేయవద్దని చెప్పి, కామేశ్వరిని ఇంటికి పంపిస్తాడు. అప్పుడే రమణయ్య పెద్ద కొడుకు అమెరికాలో చనిపోయాడని టెలిగ్రాం వస్తుంది. రమణయ్య తీవ్ర అస్వస్థతకు గురవుతాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక- మోహన్‌బాబు, కామేశ్వరికి చేసిన మోసం గూర్చి చంద్రశేఖర్ తెలియజేస్తాడు. తరువాత చంద్రశేఖర్ తాను పార్టీ ఇస్తున్నట్లు మోహన్‌బాబుకు చెప్పి లాడ్జికి రప్పిస్తాడు. అక్కడే వేరే గదిలో కామేశ్వరి వుండేటట్లు ఏర్పాటు చేస్తాడు. మోహన్‌బాబుతో మాటల సందర్భంలో పెళ్ళి ప్రస్తావన తెస్తాడు. మోహన్‌బాబు పెళ్ళికి ఒప్పుకోడు. చివరకు అందరూ కలిసి మోహన్‌బాబుని ఒప్పిస్తారు. ఇదంతా విన్న కామేశ్వరి... ''ఇంత బలవంతాన పెళ్ళాడిన వీడితో నా బతుకెలా తెల్లారుతుంది'' అని తిరస్కరించి, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. పెళ్ళి జరిగిపోయిందనే ఆనందంతో లాడ్జికి వస్తాడు రమణయ్య. విషయం తెలుసుకొని బాధపడతాడు. దీంతో నాటిక ముగుస్తుంది.
శిల్పం : కుటుంబయ్య కుమారుడు చనిపోయాడన్న సంఘటనతో నాటిక ప్రారంభమవుతుంది. కుటుంబయ్యను పరామర్శించడానికి సోమనాథం వస్తాడు. అతని మాటలు కుటుంబయ్యకు ఎంతో ఊరట కలిగిస్తాయి. కొండంత బలాన్ని ధైర్యాన్ని కలిగిస్తాయి. సోమనాథం మాటల ద్వారా రాబోయే కథా ప్రయోజనాన్ని ధ్వనింపజేస్తాడు రచయిత. సోమనాథం, కామేశ్వరి గూర్చి చంద్రశేఖర్‌తో మాట్లాడుతూ కుటుంబయ్యకు దూరపు బంధువైన రమణయ్య కొడుకు, కామేశ్వరిని పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని అంటాడు. అలాంటి వెధవలు ఇలాంటి మంచి అమ్మాయిని పెళ్ళాడరని అంటాడు చంద్రశేఖర్. మోహన్‌బాబు మంచివాడు కాడనే విషయం, మొదటి అంకంలోనే ధ్వనింపచేశారు.
రెండో అంకంలో జరగబోయే కథను సూచన ప్రాయంగా తెలియజేస్తారు. హార్బర్‌లో పనిచేసే తన కొడుకు జగన్నాధానికి కామేశ్వరి అంటే ఇష్టమనీ, సోమనాథం ద్వారా రచయిత చెప్పించడంలోని ప్రధాన ఉద్దేశం... రాబోయే రోజుల్లో ఆ రెండు పాత్రలు కలుసుకుంటాయని చెప్పడం. ఈ అంకంలోనే కామేశ్వరిని, మోహన్‌బాబు మోసం చేస్తాడు. మూడు, నాలుగు అంకాల్లో కామేశ్వరికి న్యాయం చేయడం కోసం అందరూ ఏకమవుతారు. బలవంతపు పెళ్ళి వద్దని తిరస్కరిస్తుంది కామేశ్వరి. ఈమెలో అభ్యుదయ భావాలు వుంటాయి. స్త్రీలు స్వంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని రచయిత ఉద్దేశం. చివరలో ''మనుషుల మంచి చెడ్డలు పట్టించుకోని మాకు, పోయేకాలమే కాని వచ్చేకాలం ఎక్కడిది'' అని రమణయ్య చేత అనిపించటం ద్వారా నాటిక ప్రయోజనాన్ని సాధించారు రావిశాస్త్రి.
పాత్రలు : ఇందులో ప్రధానపాత్ర సోమనాథం. అందరూ క్షేమంగా వుండాలనీ, బాగుపడాలనీ కోరుకుంటాడు. సాటి మనిషికి సహాయం చేయడంలో ముందుంటాడు. తప్పు చేసిన వ్యక్తిని మందలించి, బుద్ధి చెప్పి, మంచిమార్గంలో నడిపించగల సత్తా వున్న వ్యక్తి. శత్రువును కూడా తనవైపు తిప్పుకోగల నేర్పరి. మానవతావాది. ఆత్మ గౌరవానికి భంగం కలిగితే, ఎదురు తిరిగే మనస్తత్వం కలవాడు సోమనాథం.
ఉద్యోగం చేస్తున్న యజమాని పట్ల గౌరవ భావంతో వుంటాడు చంద్రశేఖర్. అభ్యుదయ భావాలు గల వ్యక్తి. ఇతరులకు మేలు చేయాలనే విషయంలో అందరి కంటే ముందుంటాడు. కుటుంబయ్య బాధలో వున్నప్పుడు పరామర్శించి, ధైర్యం చెబుతాడు. అప్పు ఇప్పించే విషయంలో సోమనాథానికి సహాయం చేస్తాడు. కామేశ్వరి ఆత్మహత్య చేసుకోకుండా మనోధైర్యాన్ని కలుగజేస్తాడు. సమాజంలో చెడ్డవాళ్ళే కాదు మంచివాళ్ళు కూడా వుంటారని రచయిత ఈ పాత్రను సృష్టించారు.
పురుష అహంకారానికి బలైన స్త్రీ కామేశ్వరి. చివరకు ఆత్మహత్యే గత్యంతరమనే పరిస్థితికి వస్తుంది. సోమనాథం, చంద్రశేఖర్ చెప్పిన మాటల వల్ల ధైర్యం తెచ్చుకుంటుంది. మోహనబాబు బలవంతాన పెళ్లికి అంగీకరిస్తే- ఆ పెళ్లిని తిరస్కరించి, తన ఆత్మ గౌరవాన్ని చాటుకుంటుంది. మోహన్‌బాబు పరమ మోసగాడు. దుర్మార్గుడు. నీచుడు. చండాలుడు. నయవంచకుడు. విషసంస్కృతిలో పెరిగి పెద్దవాడవుతాడు. తండ్రి సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తాడు. ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటాడు. ఇక రమణయ్య తనకు డబ్బు వుందనే గర్వంతో వుంటాడు. ఇతరులను లెక్క చేయడు. పెద్ద కొడుకు చనిపోతాడు. చిన్నకొడుకు వ్యసనాలతో మునిగి తేలుతూ వుంటాడు. అంది వచ్చిన ఇద్దరు కొడుకులు ఇలా అయినందుకు తీవ్ర మనో వేదనకు గురవుతాడు రమణయ్య. నేను గొప్పవాడను, తిరుగు లేదనే పొగరు అణిగి, క్రమక్రమంగా దారిలోకి వస్తాడు. లేటుగా జ్ఞానోదయం అవుతుంది. రమణయ్యలో ఈ మార్పు రావడం, సమాజ మార్పులో భాగమే. రావిశాస్త్రి అదే కోరుకున్నాడు.
సమాజంలో మంచివారు చెడ్డవారు వున్నట్లే ఈ నాటికలో కూడా మంచి పాత్రలు, చెడ్డ పాత్రలు రెండూ ఉన్నాయి. ఇందులోని పాత్రలన్నీ సజీవమైనవే. అందుకే చలసాని ప్రసాద్ గారు రావిశాస్త్రిని ''ది మోస్ట్ ఒరిజనల్ రైటర్'' అన్నారు. సమాజంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని బతకడానికి కామేశ్వరి నిర్ణయించుకుంటుంది. ఇదే అభ్యుదయానికి నాంది. స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం, అన్నింటిని డబ్బుతో కొనవచ్చునన్న దుర్మార్గపు ఆలోచనలో వున్న ధనవంతుల మనస్తత్వాన్ని బట్టబయలు చేయడం, కష్టాలను ఎదుర్కొని నిజాయితీగా బతకడం, భవిష్యత్తు మీద ఆశాజనకంగా జీవించడం, సమాజంలో పాతుకుపోతున్న విషసంస్కృతిని రూపుమాపడం... మొదలైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రావిశాస్త్రి ఈ నాటిక రాశారు.
(నేడు రావిశాస్త్రి జయంతి)
- ఆచార్య వెలమల సిమ్మన్న
94406 41617










