రావిశాస్త్రి కథకుడిగా, నవలాకారుడిగా తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన వ్యక్తి. కింది తరగతి ప్రజల జీవితాన్ని సాహిత్యంలోకి తీసుకొచ్చిన రచయితగా, మాండలిక భాషా ప్రయోగవాదిగా వారి స్థానం ఆధునిక సాహిత్యంలో పదిలం. అలాంటి రావిశాస్త్రి శత జయంతి తెలుగు సాహిత్య చరిత్రలో ఓ మేలి మలుపు.
రావిశాస్త్రి కథల్లో సామాన్యులు, పీడితులు, తాడితులు, సంఘ బహిష్క ృతులు పాత్రలుగా కనిపిస్తారు. సమాజంలోని కింది తరగతి ప్రజల జీవితం వ్యక్తమవుతుంది. ఆరుసారా కథలు, ఋక్కులు కథలు, విడిగా రాసిన కథలు, అన్నీ వారి సైద్ధాంతిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. కథా వస్తువు, నేపథ్యాల్లోనే కాదు, కథన పద్ధతుల్లోనూ వారిది భిన్నమైన శైలి. వారి 'కార్నర్ సీట్' కథలోని వస్తువును, శిల్పాన్ని, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని పాత్రల దృష్ట్యా విశ్లేషించడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం. ఈ కథలో మానవ జీవన విధానమే కాదు, భౌతిక పరిస్థితులు, మానసిక స్థితులు, జీవుని వేదన వంటి ఎన్నో అంశాలను అద్భుతంగా చూపించాడు రావిశాస్త్రి.
ఈ కథలో ప్రధానంగా కనిపించేవి రెండే పాత్రలు. ఒకటి రాజు. రెండోది పచ్చకోటు వ్యక్తి. కథంతా రాజు పాత్ర నుంచే చెప్తాడు రయిత. రాజు మాటలు, వ్యక్తిత్వం, ఆలోచనలు, దృక్పథంలోంచి పచ్చకోటు వ్యక్తిని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ చెప్పే విధానంలో రాజు మాటతీరు, ప్రవర్తన వాటి ద్వారా వ్యక్తమయ్యే అతడి వ్యక్తిత్వం పాఠకులకు చేరుతుంది. అంతేకాదు పచ్చకోటు వ్యక్తి మాటతీరు, వేషధారణ, ప్రవర్తన రాజు చూసే, చెప్పే విధానంలోంచే అతడి స్వభావం కూడా తెలుస్తుంది. శిల్పపరంగా ఇదో అద్భుతమైన టెక్నిక్. ఒక పాత్రను మరో పాత్ర దృష్టిలోంచి చూడడం, చెప్పడం, వివరించడం, విశ్లేషించడం అనే కథన పద్ధతిని చాలా తక్కువమందే వాడగలరు. పచ్చకోటు వ్యక్తి పాత్రను పాఠకుడు నేరుగా అర్థం చేసుకోలేడు. పాత్రను, దాని తీరుతెన్నులను అంచనా వేయలేడు. ఎందుకంటే... ఆ అవకాశం రచయిత పాఠకులకు ఇవ్వలేదు. రాజు ద్వారానే చూడమంటాడు. అందుకే ఈ కథన పద్ధతి భిన్నమైంది. వైవిధ్యమైంది. సంక్లిష్టమైంది. చేయి తిరిగిన కథకుడు రావిశాస్త్రి ఈ టెక్నిక్‌ను అద్భుతంగా వాడారు.
రాజు పాత్ర ప్రవేశంతో 'కార్నర్ సీటు' కథ ప్రారంభమవుతుంది. రాజు మాటలు, ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అనేక వర్ణనలు, సన్నివేశాలు, మాటలు కథలో కనిపిస్తాయి. ఇవి కేవలం రాజు పాత్రనే కాకుండా కథను విస్తృతం చేయడంలో, కథను ముందుకు నడిపించడంలో, మరో పాత్రను నిర్ధేశించడంలో, నిర్ణయించడంలో, పరిధిని గీయడంలో, పాఠకులకు సూచనలు, సలహాలు, ఆలోచనలు ఇవ్వడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. రాజు పాత్ర ప్రవేశంలోనే అతడిలోని ఆందోళన కనిపిస్తుంది. నిలకడ, స్థిమితం లేని వ్యక్తిత్వం ద్యోతకమవుతుంది.
''ఏ క్షణంలో బయల్దేరిపోతుందో అనే ఆందోళనతో కుడిచేత్తో టిక్కెట్టూ, ఎడం చేత్తో తోలు సంచీ పట్టుకుని పరిగెత్తేడు రాజు ప్లాట్‌ఫారం వైపు''
అతను ఊరికి ఎందుకు వెళ్తున్నాడో చెప్పే సందర్భంలో, అతడు ఆ పనిని ఇష్టంతో చేయడం లేదు. తప్పదు కాబట్టి పెళ్లికి వెళ్తున్నాడు అనే విషయం వ్యక్తమవుతుంది. ''మేనల్లుడి పెళ్ళికి వెళ్ళకపోతే బావుండదని బయల్దేరేడు. ఆ బండి తప్పిపోతే ఇహ పెళ్లికి వెళ్లినట్టే! బండి తప్పిపోయిందని చెప్పినా అక్కయ్య నమ్మదు. బావకి కోపం వస్తుంది. పెళ్లిళ్ల రోజులవడం చేత ట్రెయిన్‌లో జనం కిటకిటలాడుతున్నారు. ఎక్కడా ఖాళీ ఉన్నట్టు లేదు''
పచ్చకోటు వ్యక్తి కార్నర్ సీటులో కూర్చున్నప్పుడు, అతడి గురించి అన్న మాటల్లో అతడికి కార్నర్ సీటు దొరికిందన్న జెలసీ రాజులో కనిపిస్తుంది. తనకు దొరకలేదు అన్న కోపం కూడా వ్యక్తమవుతుంది. ''నేనెక్కడ ముందుగా వెళ్లి అక్కడ కూర్చుంటానో అని జోరుగా పరుగులెత్తిపోయి మరీ కూర్చున్నాడు దొంగవెధవ'' అని తిట్టుకుంటాడు. ''వీడి పిండాకూడుగాని పచ్చరంగు కోటు తొడుక్కోవడం ఏమిటి?'' అని ఎగతాళిగా తనలో తాను అనుకుంటాడు.
అతడికి పేపర్లో వార్తలేవి నచ్చకపోవడం, యుద్ధం గురించిన వార్తల గురించి అతడు వెధవగోల అని వ్యాఖ్యానించడం, పచ్చకోటువాణ్ణి 'ఎక్కడ దిగుతావు?' అని ప్రశ్నించడం. అతడు విసుక్కొని సమాధానం చెప్పకపోయేసరికి 'వీడికి పొగరు, దౌర్భాగ్యపు వెధవ, దిష్టిపిడతా' అని కొరకొరగా చూడ్డం... వంటివన్నీ రాజు వ్యక్తిత్వాన్ని, కార్నర్ సీటు కోసం అతడు పడే తపనని తెలియజేస్తాయి. పచ్చకోటు వ్యక్తి టిక్కెట్టు కొని ఉండడని ఊహించుకోవడం, టీసీ వస్తే దించేయాలని ఆలోచన చేయడం, రైల్వే డిపార్ట్‌మెంటు వాళ్లను తిట్టటం, అతడికి క్షయవ్యాధి ఉండొచ్చని భావించటం, మరో స్టేషన్ రాగానే ట్రెయిన్ దిగిన ఇద్దరు బికార్లతో ''ఈ బికారి కూడా ఇక్కడే దిగిపోయే బావుణ్ణు'' అని అనుకోవటం ''ఫకీరు వెధవ! శనిదేవత'' అని తిట్టడం... వంటివన్నీ రాజులోని అసమంజస ఆలోచనలను, వ్యక్తిత్వ లోపాలను తెలియజేస్తాయి. కేవలం తనకు నచ్చిన కార్నర్ సీటులో అతడు కూర్చున్నాడన్న జెలసీతోనే ఇవన్నీ ఆలోచిస్తాడు. ఇవి రాజు వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించే సన్నివేశాలు, మాటలు.
ఇలా రాజు పాత్రను అతడి ఆలోచనా ధోరణి నుంచి, మాటల తీరునుంచి పాఠకులకు అంచనా వేసే అవకాశం రచయిత కల్పించాడు. అవన్నీ అతడిని చెడుగా అంచనా వేసేవే. రాజులోని దుష్ట స్వభావాన్ని సూచించేవే. కానీ పచ్చకోటు వ్యక్తి మరణించిన తర్వాత రాజు పాత్రలో మార్పు కనిపిస్తుంది. చావు మనిషి ప్రవర్తనను, మాటలను, దృక్పథాన్ని, వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తుందో రాజు పాత్రను గమనిస్తే అర్థమవుతుంది. ''చావంటే ఎంత భయం! చచ్చినవాడి సీట్లో కూర్చుందికే భయం, అనుకొని ఖాళీ అయిన కిటికీ కార్నర్ సీట్లో కూర్చుందామా మాన్దామా అని ఆలోచించి ''కూర్చోడానికి నాకు భయం లేదు. కాని తరువాత చూద్దాం'' అని అప్పటివరకు తనకి ఎంతో ఇష్టమైన కార్నర్ సీట్ ఖాళీగా ఉన్నా రాజు కూర్చోడు.'' అంతేకాదు, అతడి మరణం తర్వాత రాజు ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. అతడిని శత్రువుగా చూశానని కూడా మర్చిపోతాడు. దిగులు పడతాడు. పొగరు, వెధవ, బికారి అని తిట్టుకున్న మనసుతోనే అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల గురించి ఆలోచిస్తాడు. ఇది రాజుపాత్రలో వచ్చిన పరిణామం. చావు ద్వారా వచ్చిన మార్పు. పరిచయం లేని, సంబంధం లేని, మాట కూడా సరిగా మాట్లాడని మరో వ్యక్తి గురించి మరణానికి ముందు, మరణం తర్వాత ఓ వ్యక్తి ఆలోచనల పరంపరే ఈ కథ.
***
రెండో పాత్ర పచ్చకోటు వ్యక్తిని కూడా రావిశాస్త్రి రాజు కోణం నుంచి, అతడి ఆలోచనల నుంచి, అతడి దృష్టి నుంచి వర్ణించే, వివరించే ప్రయత్నం చేశాడు. ఈ వివరాల్లోనుంచే రెండో పాత్రను మనం అర్థం చేసుకోవాలి. అంచనా వేసుకోవాలి. ఒక పాత్ర, మరో పాత్రకు ఆధారమవడం ఈ కథలోని టెక్నిక్.
పచ్చకోటు వ్యక్తిని రాజు తోసేయబోవడంతో ఆ పాత్ర కథలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత రాజు కూర్చుకోవాలనుకున్న కార్నర్ సీటులో ఒక్క అడుగు ముందడుగు వేయడం వల్ల అతడు వెళ్లి కూర్చుంటాడు. ఆ తర్వాత అతడి భౌతిక రూపాన్ని రాజు చూసిన విధానం కనిపిస్తుంది. 'పచ్చకోటు చెప్పలేనంతగా మాసింది. అతడు తొడుక్కున్న షర్టు తెల్లగా పువ్వులా ఉంది. కట్టుకున్న మాసీ మాయని పంచ అక్కడక్కడా చినిగి ఉంది. నెత్తి మీద పెట్టుకున్న నల్లటి మరాఠీ టోపీ కింద జుత్తు బాగా పండిపోయినట్టు కనిపిస్తోంది. అతని వయసు నలభై సంవత్సరాలకి మించకపోవచ్చు. ముక్కు చాలా ఎత్తుగా ఉండడం చేతా, కళ్ళు చాలా లోతుకు పోవడం చేతా, మనిషి గెద్దలా ఉన్నాడు. అతడు ఎవ్వరి వైపూ చూడ్డంలేదు. కిటికీలో ఎడం చెయ్యి ఆన్చుకొని, కాల్తున్న సిగరెట్టు కుడిచెత్తో పట్టుకొని ఏదో ఆలోచిస్తూ కూర్చొన్నాడు.'
ఈ వర్ణనను బట్టి అతడు బాగా బతికి, ప్రస్తుతం చితికిపోయిన వ్యక్తి అని అర్థమవుతుంది. కష్టాలు, నష్టాలు అతడిని వెంటాడుతున్నాయేమో అనే ఆలోచన పాఠకుడికి కలుగుతుంది. కథలోని రాజు ఆలోచనలు అతడి వ్యక్తిగతం అయినా, పచ్చకోటువాని భౌతిక రూపం, దుస్తులు, అతడి వాలకం పాఠకుడిలో ఒక విధమైన అతడి పట్ల ఒక విధమైన నిర్వేదాన్ని కలిగిస్తుంది. ఆసక్తిని పెంచుతుంది.
''మీరెక్కడండీ దిగుతారూ?'' అని రాజు ప్రశ్నించినప్పుడూ అతడు జవాబు చెప్పకపోవటం, తీవ్రంగా ఆలోచిస్తూ సిగరెట్టు మాటిమాటికి పీల్చడం, ఎండిన పెదవుల్ని తడిచేసుకోవటం, లోతుకుపోయిన కళ్ళతో లోపల లోతుల్లోకి చూసుకుంటున్నాడు'' అని రాజు చెప్పడంలోనే అతడి మానసిక ప్రవృత్తి, ఆందోళన, అస్తవ్యస్తమైన చిత్తంతో ఉన్నాడని అర్థమవుతుంది. ఇక ''పచ్చకోటువాడు ఏదో నిశ్చయానికి వచ్చినట్టుగా గాబాల్న లేచి కంపార్ట్‌మెంట్‌లోంచి వెనక గుమ్మంలోంచి వెనకవైపుకు దిగిపోయాడు'' అన్న మాటల్లో ఈ పాత్ర ద్వారానే కథ మలుపునకు తిరుగుతుంది అని పసికట్టవచ్చు.
అలాగే చనిపోయే ముందు అతడిని రాజు చూసిన విధానం... 'గర్వంగా ఠీవిగా ఉన్నాడు. అతని కళ్ళలో వెలుగు కనిపిస్తోంది. అతన్లో ఏదో తేజస్సు ప్రజ్వరిల్లుతున్నట్లుగా ఉంది. జగత్తునంతా తృణీకరించి చూస్తున్నట్టుగా ఉన్నాడు. నిర్లక్ష్యంగా నిటారుగా నిల్చున్నాడు''. దీనినిబట్టి అతడు తీసుకున్న నిర్ణయం ఎంత తీవ్రమైందో, అతడు ఏదో చేయకూడని కార్యానికి సిద్ధమయ్యాడన్న భావి సూచనను కూడా గమనించవచ్చు. పాత్ర మానసిక స్థితిని చెప్పడం ద్వారా ఆ పాత్ర భవిష్యత్ కార్యాచరణని సూచించడం గమనించవచ్చు. కేవలం పాత్రోచిత కథనంలో నడిచే ఇలాంటి కథన నిర్మాణంలో ఇలాంటివి మనకు అరుదుగా దొరుకుతాయి. పచ్చకోటువాని మాట, ప్రవర్తన వెనక ఏముందో, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటో... రచయిత చెప్పడు. పాఠకుడికి ఊహకు, ప్రతిభకు వదిలేశాడు.
కథలో కనిపించే మరో మూడు అప్రధాన పాత్రల గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రెండు పచ్చకోటు వ్యక్తి చనిపోయినప్పుడు ప్రవర్తించే తీరును రాజు పాత్ర ద్వారా చెప్పిస్తాడు రచయిత రావిశాస్త్రి. ఒకటి కూలీ మనిషిలా కనపించే ఆడమనిషి. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. మనిషి మరణాన్ని చూసిన ఆమె జాలితో, గుండెబరువును ఆపుకోలేక ఏడుస్తుంది. ''నిండు ప్రాణమా, మజాకానా? పోతే ఏడుపు రాదూ'' అని కళ్లు తుడుచుకుంటుంది. సహజమైన మానవత్వం కలిగిన మానవ ప్రవృత్తికి ఈ పాత్ర నిదర్శనం. మరో పాత్ర ''చనిపోయిన పచ్చకోటు వ్యక్తి నాకు తెలుసు'' అని చెప్పుకోవడం వల్ల జనాల్లో గుర్తింపును కోరుకుంటుంది. కానీ నిజానికి అతడు పచ్చకోటు వ్యక్తితో మాట్లాడికాని, అతడి ఎదురుగా కూర్చొని కానీ ఉండడు. చావులో కూడా తమ గొప్పలను ప్రదర్శించే వాళ్లను సూచించే పాత్ర ఇది. మూడోది పచ్చకోటు వ్యక్తి చనిపోయిన తర్వాత అదే సీటులో వచ్చి కూర్చొని, అతడు కూర్చున్న సీటు అని రాజు ద్వారా తెలుసుకొన్నాక, భయంతో అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మనిషికి చావంటే ఎంతో భయమో తెలియజేస్తుందీ పాత్ర.
'కార్నర్ సీటు' కథ శిల్పపరంగా ఉన్నతమైంది. కథా వస్తువును ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన భూమిక వహించేది రాజు పాత్ర. రెండోదైన పచ్చకోటు వ్యక్తి ఆత్మహత్యతో కథను మలుపుతిప్పడంతో పాటు మొదటి పాత్ర వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. అలాగే నేపథ్యం ప్రయాణం అయినా అక్కడక్కడా వర్ణనలు వాస్తవికతతో కూడి పాత్రల స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, పరివర్తనను ప్రతిబింబిస్తున్నాయి. నిజానికి ఇదో కొత్త కథా టెక్నిక్.
- డా.ఎ.రవీంద్రబాబు
80086 36981










