మిర్చి తెగుళ్ల క్రిమిసంహారిణి ఆవిష్కరణ
హైదరాబాద్ : బహుళ వ్యవసాయ వ్యాపారాలను కలిగిన గోద్రేజ్ అగ్రోవిట్ కొత్తగా మిర్చి పంటలో తెగుళ్లను అరికట్టేందుకు 'రషిన్‌బాన్'ను విడుదల చేసింది. ఈ క్రిమిసంహారిణిని జపాన్‌కు చెందిన నిస్సాన్ కెమికల్ కార్పొరేషన్‌తో కలిసి భారత్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఒక్క ఎకరాకు 400 మిల్లీలీటర్లు సరిపోతుందని.. దీని ధరను రూ.2900గా నిర్ణయించామని జిఎవిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బల్రామ్ సింగ్ యాదవ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో రషిన్‌బన్‌ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ''నిస్సన్ అభివృద్థి చేసిన ఈ మందు మిరప పుష్పించే దశలో పంటను రక్షించడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం మిరపలో భారత్ రూ.10,400 కోట్లతో 36 శాతం వాటా కలిగి ఉంది. భారతీయ మిరప సాగుదారులు తెగుళ్లు, వ్యాధుల సవాలును ఎదుర్కొంటున్నారు. మిర్చి పంటలో దాదాపు 80 శాతం తెగుళ్లు (త్రిప్స్, లెప్స్, హాప్పర్స్, పురుగులు) కారణంగా ప్రారంభ దశలోనే దెబ్బతింటుంది,'' అని తెలిపారు. ''మిరపలో 51 రకాల తెగుళ్లు ఉన్నాయి, రైతులు 45 రకాల పురుగు మందులను ఉపయోగించవలసి వస్తుంది. కొత్త ఉత్పత్తి, రాషిన్‌బాన్, పుష్పించే దశలో మిరపలోని అనేక రకాల తెగుళ్లను ఒకే దెబ్బలో త్వరగా పరిష్కరిస్తుంది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులైన హనాబీ, గ్రేసియాతో పాటు పోర్ట్‌ఫోలియోలో రషీన్‌బాన్‌ను చేర్చడం వల్ల మిరప పంట దిగుబడి పెరగడానికి దోహదం చేయనుంది.' అని బల్రామ్ పేర్కొన్నారు.