ప్రజాశక్తి - ఎర్రగుంట్ల (కడప) : పట్టణ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ సెంటర్లలోని రికార్డులను పరిశీలించారు. పట్టణంలో 21 అంగన్వాడి సెంటర్లు ఉండగా కేవలం 2 అంగన్వాడీ సెంటర్లు మాత్రమే తనిఖీ నిర్వహించారు. ఈ సెంటర్లకు సంబంధించి ఫిర్యాదులు అందడంతోనే తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ముద్దనూరు రోడ్డు లోని స్వప్న హౌటల్ వీధిలోని అంగన్వాడీ వర్కర్ కళావతి అంగన్వాడి సెంటర్ కు వచ్చే పిల్లలకు గానీ, సెంటర్ పరిధిలోని గర్భిణీ స్త్రీలకు గానీ గుడ్లు, చెక్కిలు వంటి పంపిణీలో అవకతవకలు జరిగాయని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజరు ప్రతాప్ రెడ్డి అన్నారు. నడివూరులోని అంగన్వాడీ వర్కర్ మంజుల రికార్డులలో వచ్చినట్లు చూపించి, గత రెండు రోజులు కడపలో జరిగిన ధర్నా కార్యక్రమానికి హాజరైనట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వీరు ప్రభుత్వాన్ని మోసం చేసే విధంగా చర్యలు చేసినందుకు తాము జారీ చేయాలని పిడి లక్ష్మికి ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడి సూపర్వైజర్లు ప్రతి సెంటర్ ను సందర్శించి రికార్డుల ప్రకారం స్టాక్ లిస్ట్ ఉన్నాయా అని చేసుకోవాలని పిడి లక్ష్మికి సూచనలు ఇచ్చారు. మండలంలోని చాలా సెంటర్ లను గత ఐదు నెలలుగా ఎవరూ కూడా విజిట్ చేయలేదని, దీని కారణంగా అంగన్వాడీ వర్కర్లు ఇస్తానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మండలంలో 66 సెంటర్లకు సంబంధించి ఒక్కరే సూపర్వైజర్ ఉన్నారని, దానివలన విజిట్ చేయలేకపోయామని చెప్పుకొచ్చారు. అంగన్వాడీ సెంటర్లలో కానీ, రేషన్ షాపుల్లో కానీ, ప్రభుత్వ హాస్టల్స్ లో కానీ అవకతవకలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు.










