ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :విజయనగరం జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన రామతీర్థసాగర్‌కు ఈసారీ అరకొరగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు తాజాగా సుమారు రూ.561.68 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఈ నెల 19న రూ.194.40 కోట్లు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే రూ.355.24 కోట్లు, భూ సేకరణకు రూ.31.38 కోట్లు, ఆర్ అండ్ ఆర్‌కు రూ.175.06 కోట్లు చొప్పున మొత్తం రూ.561.68 కోట్లు అవసరమని అధికారిక అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మంజూరు చేసిన నిధులు ఏ మూలకూ చాలవని ఆయకట్టు రైతులు పెదవి విరుస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టి సుమారు 18 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆయకట్టు భూములకు సాగునీరందడం లేదు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం కల్పించలేదు. రెండుసార్లు బడ్జెట్ సవరింపులు చేసినా నిధులు మాత్రం అరకొరగానే మంజూరు కావడంతో సాగునీటి కోసం రైతులు, పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం కోసం నిర్వాసితులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అవసరమైన మేరకు నిధులు విడుదల చేయాలని, ఈ ప్రాజెక్టును ఇప్పటికైనా పూర్తి చేయాలని, పరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు. విజయనగరం జిల్లా డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో సుమారు రూ.24,710 ఎకరాలకు సాగునీరు, విజయనగరం పట్టణ ప్రజలకు తాగునీటి అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2.7 టిఎంసిల సామర్థ్యంతో 2005 ఫిబ్రవరి 19న రూ.220.04 కోట్ల అంచనా వ్యయంతో తారమతీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. బ్యారేజీ పనులు 80 శాతం, కుమిలి వద్ద చేపట్టిన జలాశయ నిర్మాణ పనులు 50 శాతమే జరిగాయి. బ్యారేజీ నుంచి రిజర్వాయర్ వరకు చేపట్టాల్సిన 14 కిలోమీటర్ల డైవర్షన్ కాలువలో రెండున్నర కిలోమీటర్లు మినహా మిగిలిన తవ్వకాలు పూర్తయ్యాయి. సకాలంలో భూసేకరణ చేపట్టకపోవడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, కేటాయించిన నిధులు విడుదల కాకపోవడంతో 2015 సెప్టెంబర్ 21న అంచనా వ్యయం రూ.471.31 కోట్లకు పెరిగింది. అనంతరం మరో ఐదేళ్లపాటు పెద్దగా పనులు చేపట్టకపోవడంతో 2020 ఏప్రిల్ 29న రెండోసారి బడ్జెట్ సవరిస్తూ రూ.739.90 కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇంతవరకూ 281.51 కోట్లు ఖర్చు చేశారు. పనులు సకాలంలో పూర్తి కాకపోతే నిర్మాణ వ్యయం మళ్లీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇవీ మిగులు పనులు
- ప్రాజెక్టు డిజైన్ సమయంలో ప్రతిపాదించిన 3,447 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 3,235 ఎకరాలు సేకరించారు. మిగిలిన 212 ఎకరాలతోపాటుపాటు పిల్ల కాలువల కోసం 150 ఎకరాలకు వరకు అదనంగా సేకకరించాల్సి ఉంటుంది.
-బ్యారేజీ వద్ద ఇంకా 20 శాతం పనులు జరగాల్సి ఉంది.
- 1.5 కిలోమీటర్ల మేర డైవర్షన్ కెనాల్ తవ్వకం చేపట్టాలి. అనంతరం డైవర్షన్ కెనాల్ మొత్తానికి రాతికట్టు నిర్మించాలి.
-జలాశయం పనులు ఇంకా 50 శాతం జరగాల్సి ఉంది.
- జలాశయం నిర్మాణంలో భాగంగా రెండు కొండల మధ్య డైక్-2 నిర్మాణం జరగాల్సి ఉంది.
- నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం పూర్తి స్థాయిలో కల్పించాల్సి ఉంది.










