హైదరాబాద్: యాదగిరిగుట్ట ఆలయంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిపై అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమీక్ష అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని సీఎం దర్శించుకోనున్నారు. ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే సీఎం పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, యాత్రికులు స్వామివారికి పసిడి సమర్పించారు. తానూ కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు అప్పుడు ప్రకటించిన సీఎం.. ఆ స్వర్ణాన్ని స్వామికి సమర్పించనున్నారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు, సమీప ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు దసరాకు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో సీఎం యాదగిరిగుట్ట పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.










