Aug 07,2023 07:46

నా గురించీ... నా నేల గురించీ
వలవలూడ్చి నడిరోడ్డు మీద
ఊరేగించబడ్డ నా నగదేహం గురించీ
నా సోదరుడి తెగిన తల గురించీ
మాట్లాడు రాజ్యమా!
మౌనమొదిలి మాట్లాడు!

యేసును పూజించినందుకు
రామబాణం ప్రయోగించబడిన దాన్ని
కులాల కుంపటిలోకి నెట్టబడిన ఆదిమ తెగని
అడుగుతున్నాను రాజ్యమా! మాట్లాడు.

లౌకికతత్వం గురించి
నువ్వు మాట్లాడితే వినాలనుంది
యత్ర నారీ పూజ్యంతే... అని ఏదో వల్లిస్తావుగా
ఈ నేల మీద ఏ దేవతలు ఎలా నడుస్తుంటారో
నువ్వు చెప్తే వినాలనుంది... ఒక్కసారి మాట్లాడు
స్త్రీల హక్కుల గురించి మాట్లాడితే వినాలనుంది

ఇదే నేల మీంచి
చందమామ మీదకి అడుగుపెడుతున్న ఈ రోజుల్లో
ఒకే ఒక్క డోలో మాత్ర కోసం
డోలీల్లో గెడ్డ దాటుతున్న దృశ్యం గురించి
నువ్వు మాట్లాడితే వినాలనుంది
ఇక్కడి ఇండిజినస్‌ ఇండియన్‌ని అడుగుతున్నాను

రాజ్యమా! మాట్లాడు!
భిన్నత్వం పునాదుల్లోంచి మొలుచుకొచ్చిన విశాల వృక్షాన్ని
ఏకత్వం గురించి నువ్వు నిర్వచిస్తే వినాలనుంది
ప్రపంచమూ వినాలని ఎదురుచూస్తోంది
మాట్లాడు రాజ్యమా! మాట్లాడు!

నగంగా నడిచింది నేనైనా...
బయటపడిన నగత్వం నీదో కాదో నువ్వే చెప్పాలి

లౌకికత్వం గురించీ... సామరస్యం గురించీ...
సౌబ్రాతత్వం గురించీ... కులాల కుంపటి గురించీ...
మతం మంటల గురించీ...
నువ్వు మాట్లాడితే వినాలని ఎదురు చూస్తోంది ప్రపంచం

మాట్లాడు రాజ్యమా! మాట్లాడు!
మాయపొరలు విడిచి మాట్లాడు

ముక్కుపచ్చలారకుండానె చెరచబడి
సగం కాలిన హత్రాస్‌ నేలై నిలదీస్తున్నా...
రక్తమోడిన బాల్కిన్‌ బానోనై అడుగుతున్నా...
ఒక షెడ్యూల్డ్‌ నేలనై ప్రశ్నిస్తున్నా...
మండుతున్నది మణిపూరే అయినా
అంటుకున్నదేదో నువ్వు చెప్తే వినాలనుంది
దేహాల్ని దిష్టిబొమ్మను చేసి
దేశపటంలోంచి కాజేస్తున్న పంట గురించి
నువ్వు నిర్వచిస్తే వినాలనుంది
మాట్లాడు... ఒక్క మాట
రాజ్యమా! రామరాజ్యమా... సమాధానం చెప్పు!
నీ గొంతుతో సమాధానం చెప్తే వినాలనుంది
మాట్లాడు! గొంతు సవరించి మాట్లాడు!
మౌనం అర్ధాంగీకారం కానేకాదిప్పుడు...

ఇప్పుడు ...
మౌనం నేరాంగీకారం!
 

- మల్లిపురం జగదీష్‌